హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఏఐఎంఐఎం కార్పొరేటర్ స్థానిక పోలీసులపై చేసిన దౌర్జన్యంపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ఎవరినైనా సరే వదలొద్దని డీజీపీని మంత్రి ఆదేశించారు. ఏ పార్టీకి చెందిన వారనేది పట్టించుకోవద్దని, పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.






సోమవారం రాత్రి ఓ వ్యక్తి పోలీసులను తిడుతున్నట్లుగా ఓ వీడియో విపరీతంగా వైరల్ అయింది. రాత్రివేళ పెట్రోలింగ్ కోసం వచ్చిన కానిస్టేబుళ్లపై స్థానిక నేత ఒకరు విపరీత స్థాయిలో విరుచుకుపడ్డారు. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులను అడ్డుకోవడమే కాకుండా, అసలు నా ఇలాఖాలో మీకేం పని అంటూ ఓవరాక్షన్ చేశాడు. వంద రూపాయల పోలీసులు అంటూ అవహేళన చేశాడు. ‘పిలువు నీ.. ఎస్సైని పిలువు.. ఏసీపీ ఫోన్ చెయ్యి మీ సంగతేంటో చూస్తా’’ అంటూ దబాయించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.







మంగళవారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్‌కి వచ్చారు. భోలక్ పూర్ ప్రాంతంలో అప్పటికీ తెరిచి ఉన్న కార్పొరేటర్‌కు చెందిన ఓ హోటల్‌ను మూయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడికి చేరుకున్న మహ్మద్ గౌసీయుద్దీన్ కానిస్టేబుళ్లపై విరుచుకుపడ్డారు. ఎస్సైని పిలవాలని మీరంతా వంద రూపాయల మనుషులని ఎగతాళి చేస్తూ మాట్లాడారు.



దీంతో ఓ వ్యక్తి ఆ వీడియోను ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ‘‘ఇలాంటి బిహేవియర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పోలీసులు ఎప్పుడు మర్యాద కోరుకుంటారు. ఇలాంటి ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేదనిది’’ అంటూ కేటీఆర్‌ను, తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.


దానిపై స్పందించిన మంత్రి.. పోలీసులపై దౌర్జన్యం ప్రదర్శించిన బోలక్ ఎంఐఎం కార్పొరేటర్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించేవారు ఎవరైనా సరే.. ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించవద్దని డీజీపీకి సూచించారు.