ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య మళ్లీ వివాదం షురూ అయింది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రెండు రాష్ట్రాలు ఇప్పుడు బహిరంగ విమర్శలకు దిగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై తెలంగాణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యకం చేస్తోంది. 


దిల్లీలో ప్రధానమంత్రి మోదీతో సమావేశమైన జగన్ మోహన్ రెడ్డి తెలంగాణపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని... వాటిని ఇప్పించాలని అభ్యర్థించారు. తెలంగాణ నుంచి ఏపీ జెన్కోకు 6, 455. 76 కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు. రాష్ట్రం విభజన నాటి నుంచి 2017 జూన్ వరకు బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు జగన్. దీనిపై చొరవ తీసుకొని ఇప్పించాలని వేడుకున్నారు. 


మరోవైపు కృష్ణా జలాల వాడకం విషయంలో పాతగాయం మళ్లీ రేగింది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తెరపైకి వచ్చింది.


కృష్ణా నీటి వాడకం విషయంలో తెలంగాణను నియంత్రించాలని కోరుతూ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  విద్యుత్ ఉత్పత్తి కోసం సాగర్ జలాలను తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వాడుకుంటోందని లేఖలో పేర్కొంది ఏపీ. గతేడాది కూడా వర్షాకాలానికి కంటే ముందే సాగర్ నుంచి నీటిని తరచూ విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించడం వల్ల పులిచింతల ప్రాజెక్టు స్పిల్‌వే రేడియల్ గేట్లను తెరవడం, మూయడం చేయాల్సి వచ్చిందని ఏపీ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌  నారాయణ రెడ్డి కేఆర్‌ఎంపీకి లేఖ రాశారు. 


గతేడాది జరిగిన పరిమితికి మించి నీటికి వాడకంతో స్పిల్‌ వే గేట్ కొట్టుకుపోయిందని గుర్తు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికైనా కంట్రోల్ చేయకుంటే పులిచింతల రిజర్వాయర్‌ పూర్తి స్థాయి మట్టానికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీలో నీరు అధికంగా ఉండటంతో వచ్చే నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తుందన్నారు. 


అమూల్యమైన నీటిని పొదపు చేయాల్సింది పోయింది ఇలా ఖర్చు పెట్టడం సరికాదని హితబోధ చేసింది ఏపీ ప్రభుత్వం. దిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని కూడా జగన్ కేంద్రం వద్ద ప్రస్తావించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 


కేఆర్‌ఎంపీకి ఏపీ లేఖ రాయడంపై తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి. సాగర్ జలాలను ఉపయోగించి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అనడంలో నిజం లేదన్నారు. అనవసర ఆరోపణలతో తన గౌరవాన్ని పోగొట్టుకుంటుందన్నారు. పవర్ గ్రిడ్‌ను కాపాడుకునేందుకు ఐదు పది నిమిషాలకసు మించి నీటిని వినియోగించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు జగదీష్ రెడ్డి. శ్రీశైలం నుంచి ఏపీ ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపించారాయన.