KTR Comments on Andhrapradesh: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఏపీలో మౌలిక వసతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు, నీళ్లు లేవని, రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని చెప్పారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టే ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారని అన్నారు. స్వయంగా ఏపీలో సొంతూర్లకు వెళ్లిన తన స్నేహితులే ఈ విషయాలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణం సహా చక్కటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 11వ ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీ షో శుక్రవారం జరిగింది. ఈ ప్రాపర్టీ షోకి మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు.
‘‘ఏపీలో ఉన్న పరిస్థితిని సంక్రాంతికి ఇంటికి వెళ్లొచ్చిన నా స్నేహితుడు ఒకరు నాకు ఫోన్ చేసి చెప్పారు. అక్కడ కరెంటు, నీళ్లు లేవట.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయట. ఇక్కడి నుంచి కొంత మంది జనాల్ని బస్సులు వేసి ఏపీకి పంపాలని కోరాడు. ఎందుకంటే.. ఇక్కడ ఉన్న మెరుగైన పాలన విలువ జనాలకి తెలుస్తుందని చెప్పాడు. నేను చెప్పేది అతిశయోక్తి అనిపిస్తే మీరు కూడా వెళ్లి చూసి రండి. నేనేదో తెలంగాణ రాష్ట్రం గురించి డబ్బా కొట్టడం లేదు. ఇవి వాస్తవాలు.’’ అని మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
దేశంలోకెల్లా హైదరాబాద్ ఉత్తమ నగరం అని కేటీఆర్ అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు. నగరంలో రోడ్ల అభివృద్ధిని చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా మెచ్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పక్క రాష్ట్రాల నుంచి బిల్డర్లు వస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. తాగు నీటి కోసం జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ప్రతి రోజు తాగునీరు ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్‌లోపు వంద శాతం ఎస్‌టీపీ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.
జీవో 111 గురించి మాట్లాడుతూ.. దాన్ని తన కోసమే ఎత్తివేశారని ఒక పిచ్చోడు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 111 జీవో పరిధిలో లక్షా 30 వేల ఎకరాలు ఉన్నాయని, అవన్నీ తనవేనా అని నిలదీశారు. జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ జీవో పరిధిలో అద్భుతమైన అధునాతన నగరాన్ని సృష్టించవచ్చని తెలిపారు.