హైదరాబాద్ నగరంలో నేడు (ఏప్రిల్ 29) వేర్వేరు చోట్ల జరిగే కార్యక్రమాల వల్ల వాహనదారులకు కాస్త ఇబ్బందులు ఎదురు కానున్నాయి. కాబట్టి, ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం మంచిది. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరుకానున్నారు.


అంతేకాక, రంజాన్‌ నెలలో చివరి శుక్రవారం కావడంతో పాత బస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాలు ఉన్నందున ఆ ప్రదేశాలకు సమీపంలో అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లుగా ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. వాహనదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని కోరారు.


ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్‌ పార్టీకి ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరు అవుతారు కాబట్టి, శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలుకానున్నాయి. అందులో భాగంగా ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ - బీజేఆర్‌ స్టాట్యూ - బషీర్‌బాగ్‌ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్‌ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్‌ రూమ్‌ వైపు అనుమతించరు.


* అబిడ్స్ గన్‌ ఫౌండ్రీలోని స్టేట్ బ్యాంకు నుంచి బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు వచ్చే వాహనాలను చాపెల్‌ రోడ్‌ మీదుగా, రవీంద్ర భారతి, హిల్‌ ఫోర్ట్‌ రోడ్‌ వైపు నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్‌ మీదుగా, బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్‌ రోడ్‌ వైపుగా మళ్లించనున్నారు.


* నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌ బాగ్‌ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద, కింగ్‌ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్ నుంచి వచ్చే వాహనాలను కింగ్‌ కోఠి చౌరస్తా నుంచి తాజ్‌ మహల్‌ హోటల్‌ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్‌ నుంచి కంట్రోల్‌ రూమ్‌ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా అనుమతించనున్నారు.


మక్కా మసీదులో ప్రార్థనల వల్ల ట్రాఫిక్ సమస్యలు
* శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్‌ - మదీన, చార్మినార్‌ - ముర్గీ చౌక్, రాజేష్‌ మెడికల్‌ హాల్‌ - శాలిబండ మధ్య మార్గాల్లో వాహనాల రాకపోకలను నిషేధించారు. వీటిని మదీనా కూడలి, హిమ్మత్‌పుర, చౌక్‌ మైదాన్‌ ఖాన్, మోతీగల్లీ, ఈదీ బజార్‌ చౌక్, షేర్‌ బాటిల్‌ కమాన్, ఓల్డ్‌ కమిషనర్‌ కార్యాలయం చౌరస్తాల నుంచి అవసరాన్ని బట్టి మళ్లిస్తున్నారు.


పార్కింగ్ స్థలం ఇక్కడ
మక్కా మసీదులో ప్రార్థనలకు సొంత వాహనాల్లో హాజరయ్యే వారి కోసం గుల్జార్‌ ఫంక్షన్‌ హాల్, ముఫీదుల్‌ అమాన్‌ గ్రౌండ్స్, ఛార్మినార్‌ బస్‌ టెర్మినల్, ఆయుర్వేదిక్‌ యునానీ హాస్పిటల్, ఖిల్వత్‌ గ్రౌండ్స్, ఓల్డ్‌ పెన్షన్‌ ఆఫీస్, సర్దార్‌ మహల్‌ల్లో పార్కింగ్‌ వెసులుబాట్లు కల్పించారు. 


సికింద్రాబాద్‌‌లోనూ రంజాన్ ప్రార్థనలు జరగనున్నందున ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మహంకాళి పోలీసు స్టేషన్‌ నుంచి రామ్‌గోపాల్‌ పేట రోడ్డు జంక్షన్‌ మధ్య మార్గాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసేస్తారు. బాటా చౌరస్తా నుంచి సుభాష్‌ రోడ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లాలా టెంపుల్‌ మీదుగా పంపించనున్నారు.