KTR in Bio Asia Summit: కరోనా విషయంలో బాగా అభివృద్ధి చెందిన దేశాల వ్యాక్సిన్ల కన్నా భారత్‌లో తయారైన టీకాలు అత్యంత ప్రభావవంతంగా నిలిచాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) అన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధి, పంపిణీలో భారత కంపెనీలు వేగంగా స్పందించాయని బిల్ గేట్స్ ప్రశంసించారు. కొవిడ్ వ్యాక్సిన్లతో పాటు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల కోసం భారత్ వైపు చూసే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని, భవిష్యత్తులో ఇలాంటి వైరస్ మహమ్మారులు కనుక ప్రబలితే భారత్ ఆర్ అండ్ డీ సెంటర్లతో కలిసి పనిచేస్తామని బిల్ గేట్స్ అన్నారు. బయో ఆసియా-2022 (Bio Asia 2022) అంతర్జాతీయ సదస్సులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాల్గొన్నారు. వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సులో ఆయనతో పాటు తెలంగాణ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ (KTR) పాల్గొని చర్చ నిర్వహించారు.
సదస్సు మొదటి రోజు బిల్‌గేట్స్, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కొవిడ్ పాండమిక్ ఆరోగ్య రంగంపై విసిరిన సవాళ్లు, గ్లోబల్‌గా పలు దేశాలు స్పందించిన తీరుపై బిల్ గేట్స్, కేటీఆర్ చర్చించారు. భవిష్యత్తులో రాబోయే పాండమిక్స్‌ను ఎలా ఎదుర్కోవాలని కేటీఆర్ ప్రశ్నించగా.. డయాగ్నోస్టిక్స్, థెరపెటిక్స్ అభివృద్ధి చెందాలని, ఆర్ అండ్ డీపై ప్రపంచదేశాలు ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని బిల్ గేట్స్ అన్నారు. ఫ్యూచర్ పాండమిక్ రెడీనెస్‌పై తాను ఓ పుస్తకం రాస్తున్నట్లుగా చెప్పారు.
తీరిక లేకుండా ఉన్న సమయంలో దీనిపై టైం ఎలా కేటాయించగలుగుతున్నారని కేటీఆర్ అడగ్గా.. ‘‘ఇప్పటికే వాతావరణ మార్పులపై ఒక పుస్తకం రాశా. ఇది నా రెండో పుస్తకం.’’ అని బిల్ గేట్స్ చెప్పారు. సూక్ష్మజీవుల ద్వారా వ్యాప్తి చెందే రోగాల నియంత్రణకు ఎలాంటి సన్నద్ధత అవసరమని కేటీఆర్ ప్రశ్నించారు. క్యాన్సర్, గుండె జబ్బులకన్నా ఒకరి నుంచి మరొకరికి సోకే ఇలాంటి వ్యాధులు చాలా ప్రమాదకరం. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు వ్యాప్తి చెందే వ్యాధులు పెద్ద సవాలు విసురుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపైనా సైతం ప్రభావం చూపుతుంది.
హెల్త్‌లో టెక్నాలజీపై బిల్ గేట్స్ మాట్లాడుతూ.. సాంకేతికత సాయంతో ఆరోగ్య రంగంలో సేవలు సులభతరమవుతాయని అన్నారు. అప్పుడు ప్రతి సమస్యకు రోగి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా రిమోట్‌గానూ కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అంచనా వేశారు. డయాగ్నోస్టిక్స్ విషయానికి వస్తే బీపీ, షుగర్ మానిటర్లు, స్మార్ట్ వాచెస్ లాంటివి ఈ కోవలోనివేనని చెప్పారు.
హెచ్‌ఐవీ నియంత్రణ, పిల్లల్లో పోషకాహార లోపంపై వచ్చే పదేళ్లలో బిల్ గేట్స్ ఫౌండేషన్ కృషి చేస్తుందని బిల్ గేట్స్ అన్నారు. పోషకాహర లోపం లేని సమాజమే.. రేపు అభివృద్ధి చెందిన పౌరులను, దేశాన్ని తీర్చిదిద్దుతుందని అన్నారు. చివరిగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను సందర్శించాలని బిల్ గేట్స్‌ను కోరారు. భవిష్యత్తులో సందర్శించే హైదరాబాద్ నగరం పూర్తిగా అభివృద్ధి చెందిన, సరికొత్త రకమైన అనుభూతినిస్తుందని కేటీఆర్ అన్నారు.