KTR America Tour: తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా సాగిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటనలో చివరి రోజైన నేడు ఒక్కరోజే 4 సంస్థల యాజమాన్యాలతో కేటీఆర్ సమావేశమై.. వాటిని హైదరాబాద్‌కు ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవి అంగీకారం కూడా తెలిపాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లోని అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ (Advent International) హెడ్ క్వార్టర్స్‌లో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశం అయ్యారు. భారత్‌లోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో వారు చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆర్ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్‌లో మెజార్టీ వాటాలు కొనేందుకు రూ.1,750 కోట్లను పెట్టుబడులు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్‌కు అడ్వెంట్ కంపెనీ తెలిపింది. ఆ పెట్టుబడుల నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తోన్న స్లేబ్యాక్ ఫార్మా.. హైదరాబాద్‌లో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ.1500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. హైదరాబాద్ ఫార్మారంగంలో (Pharma In Hyderabad) విస్తరణకు వ్యూహాలు రచించినట్లు సదరు కంపెనీలు మంత్రి కేటీఆర్‌కు తెలిపాయి. రాష్ట్రంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఎదుగుదలకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు.
హైదరాబాద్‌లోని (Hyderabad) లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో రూ.1750 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇస్తున్న ప్రాధాన్యం, కల్పిస్తున్న మౌలిక వసతుల వల్ల తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది. 2011లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి సాధించిన పురోగతి, విజయాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో చెప్పారు.
ఇంకా స్లే బ్యాక్ కంపెనీ విధానాలను కూడా మంత్రి కేటీఆర్ కొనియాడారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలను ఉపయోగించుకోవాలని కోరారు. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా 2 లక్షల వేల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అత్యాధునిక ప్రయోగశాలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, మూలధనం కోసం రెండేళ్లుగా 5 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందని 70 మందికి ఉద్యోగాలను కల్పించిందని మంత్రి కేటీఆర్‌కు కంపెనీ వివరించింది.
ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే అడ్వాన్స్‌డ్ ల్యాబ్ లో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందని అన్నారు. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్ వ్యాలీలో తాము ఏర్పాటుచేసే ఈ అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు చెప్పారు.