కార్లకు నకిలీ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్ములు తగిలించుకొని చాలా మంది తిరుగుతున్న వేళ హైదరాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లో కొద్ది రోజుల క్రితం బోధన్ ఎమ్మెల్యే కుమారుడి కారు ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఘటన అనంతరం పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శనివారం కూడా పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా సినీనటులు అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌లకు చెందిన కార్లకు బ్లాక్ ఫిల్ములు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ బ్లాక్ ఫిల్మ్ లేయర్లను జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు తొలగించారు. అనంతరం చలానాలు కూడా విధించారు. ఒక్కో కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉన్నందుకు గానూ రూ.700 జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.


దీనిపై జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్సై శ్రీధర్‌ స్పందించారు. శనివారం తాము జూబ్లీహిల్స్ రోడ్‌ నంబరు 36లోని నీరూస్‌ కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ఆ సమయంలోనే అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌‌కు చెందిన కార్లు అటుగా వెళ్తుంటే ఆపామని అన్నారు. ఆ రెండు కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్ములను తొలగించి రూ.700 చొప్పున చలాన్లు విధించామని తెలిపారు. వీరి వాహనాలే కాక నలుపు తెరలతోపాటు ఇతర నిబంధనలు పాటించని మరో 80కిపైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.


కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కారుకు కూడా పోలీసులు బ్లాక్ ఫిల్మును తొలగించిన సంగతి తెలిసిందే. మార్చి 20న ఆ ఘటన జరిగింది. ఎన్టీఆర్ కారును ఆపి బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్‌ లేరు. డ్రైవర్‌ మాత్రమే ఉన్నాడు. డ్రైవరుతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ కుమారుడు, మరో వ్యక్తి ఉన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న వారు స్పష్టంగా కనిపించాల్సిందేనని, బ్లాక్ ఫిల్మ్ కోటింగ్ ఉన్న అద్దాలు అమర్చడం నిబంధనలకు విరుద్ధం అనే సంగతి తెలిసిందే.


జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం (Jubilee Hills) తరువాత ట్రాఫిక్‌ పోలీసులు రూట్ మార్చారు. బోధన్ ఎమ్మెల్యే (Bodhan MLA) కుమారుడు కారులో ఉండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నెలల పసికందు చనిపోగా, ఓ మహిళ గాయాలపాలయింది. ప్రస్తుతం బోధన్ ఎమ్మెల్యే షకీల్ (MLA Shakeel) కుమారుడు రేహాన్ ఆచూకీ ఇంకా తెలియలేదు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. నగరంలో చాలా మంది ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే నకిలీ స్టిక్కర్‌ పెట్టుకోవడం, పోలీస్‌ కాకపోయినా పోలీస్ స్టిక్కర్ వేయించుకోవడం, ఇలాగే ఆర్మీ, డాక్టర్‌, ప్రెస్‌ అంటూ స్టిక్కర్లు అంటించుకుని తిప్పుతున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.