Revanth Reddy :  గ్యాస్, పెట్రోల్ ధరలు(Petrol Rates) పెంచిందని కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS Govt) తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు(Power Charges) ఎందుకు పెంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పెట్రోల్ ధర పెంచితే, రాష్ట్రం విద్యుత్ ఛార్జీలు పెంచుతుందన్నారు. ఒకరి తప్పు ఇంకొకరు కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నిమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని, ప్రభుత్వాలే జేబుదొంగల్లా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారన్నారు. తెలంగాణ రైతుల సమస్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.  


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగలు 


కరోనాతో కుదేలైన పేదలకు సాయం చేయడం మానేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగల్లా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు విపరీతంగా పెంచుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేశారని, ఒకరి తప్పు ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు, సర్ ఛార్జ్(Sur Charge) పేరుతో రూ.6 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఛార్జీలు పెంచొద్దని ఈఆర్సీ ముందు తన వాదన వినిపించినా పట్టించుకోలేదన్నారు. విద్యుత్ సంస్థలు ఆర్థికంగా దెబ్బతినడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమే కారణమని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అంటూ సామాన్యుడిపై విద్యుత్ భారం మోపుతున్నారని ఆక్షేపించారు. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో రూ.12,500 కోట్లు బకాయిపడ్డాయని తెలిపారు. 


మార్చి 31న సిలెండర్లకు దండలు, డప్పు చాటింపులు 


ఐదు రాష్ట్రాల ఎన్నికల అయ్యేవరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని, ఎన్నికలు అయిపోగానే  గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను కేంద్రం పెంచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీడీపీ(GDP) పెంచుతామన్న ప్రధాని మోదీ గ్యాస్(Gas), డీజిల్(Diesel), పెట్రోల్(Petrol) ధరలు పెంచారని విమర్శించారు. కేసీఆర్ విద్యుత్ ఛార్జీలు, మోదీ గ్యాస్ ధరలు పోటా పోటీగా పెంచుతున్నారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రజల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్చి 31న సిలిండర్లకు దండలు వేసి, డప్పు చాటింపు వేస్తామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ మండల కేంద్రంలో ఏఈ, డీఈ కార్యాలయాల ముందు ఆందోళనలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.  ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. ఏప్రిల్ 7న హైదరాబాద్(Hyderabad) లో విద్యుత్ సౌధ ముట్టడి చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్, మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను చంపుతున్నారని ఆరోపించారు.