Medchal News: మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన 16 ఏళ్ల రాగుల వంశిత అనే విద్యార్థిని వారం క్రితమే నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో జాయిన్ చేశారు. అయితే వంశిత ఈరోజు అనుమానాస్పద స్థితిలో కింద పడి మృతి చెందింది. విషయం గుర్తించిన విద్యార్థినులు అక్కడే ఉన్న వార్డెన్లు, ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే  కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు. వంశిత బిల్డింగ్ పై నుండి దూకిందా, లేక ఇతర కారణాలు వల్ల ఏమైనా చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


ఐదు రోజుల  క్రితమే విద్యార్థిని ఆత్మహత్య



హైదరాబాద్ లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. భరత్ నగర్ బస్తీలో నవ్య అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థి జూన్ ఏడవ తేదీ రాత్రి 7:30 గంటలకు ఉరి వేసుకుని విద్యార్థిని నవ్య ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. తమ కూతురుది ఆత్మహత్య కాదని ఎవరో ప్రతి రోజు రాత్రి ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు చేశారని అందువల్లే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు. గత నాలుగు రోజులుగా తమ ఇంటి ముందు నిమ్మకాయలు, అగరుబత్తులు, కొబ్బరికాయలు పెట్టి వెళ్తున్నారని నవ్య కుటుంబ సభ్యుల ఆరోపణలు చేశారు. కేసు నమోదు చేసుకుని కుల్సుంపుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


జూన్ 5వ తేదీ నుంచి బీడీఎస్ స్టూడెంట్ మృతి


వరంగల్ జిల్లాకు చెందిన సముద్రాల మానస ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. కాలేజీకి సమీపంలో ఉన్న హాస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది మానస. ఇది గమనించి విద్యార్థినులు హాస్టల్ నిర్వాహకులకు చెప్పారు. వారు మానస గది తలుపులు బద్దలుకొట్టి  లోపలికి వెళ్లే సమయానికే జరగకూడదని నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి మానస చనిపోయినట్లు నిర్ధారించారు. హాస్టల్ నిర్వాహకుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఫిబ్రవరిలో వరంగల్ లో ఇలాంటి ఘటనే..


ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మెడికో విద్యార్థిని మానస ఓ పెట్రోల్ బంకుకు వెళ్లింది. పెట్రోల్ బంక్ లో మానస పెట్రోల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పోలీసులకు ఈ విషయం తెలిసింది. వైద్య విద్యార్థిని మానస స్వస్థలం వరంగల్ కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వరంగల్ జిల్లాకే చెందిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక తానే పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది ప్రీతి. తొలుత అపస్మారక స్థితిలో గమనించిన తోటి విద్యార్థినులు మేనేజ్ మెంట్ కు సమాచారం అందించగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్న తరువాత నాలుదైదు రోజులు చికిత్స పొందిన ప్రీతి చివరకు బ్రెయిన్ డెడ్ అయింది. చివరగా ప్రీతి చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.