వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీత పిటిషన్ వేశారు. దీన్ని విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ నుంచి విచారణ ప్రారభించింది. 


అవినాష్‌ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన సునీత తానే స్వయంగా వాదనలు వినిపించారు. ఆమెకు సహకరంచేందుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాను సుప్రీంకోర్టు బెంచ్ అనుమతించింది. 


సునీత పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం అత్యవసరం విచారణ చేపట్టాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. అవినాశ్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమా లేదా విచారణకు సహకరిస్తున్నాడా లేదా అన్నది దర్యాప్తు సంస్థ వ్యవహారమని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సెలవుల అనంతరం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని పేర్కొంది. 


దీనిపై కౌంటర్ వాదనలు వినిపించిన సునీత.. వివేక హత్యకేసు దర్యాప్తు ఈ నెల 30లోగా ముగించాలని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని గుర్తు చేశారు. ఈలోగా ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం ఉందని వాదించారు. దీనికి సమాధానంగా ఇంకో ధర్మాసనం పెట్టిన డెడ్‌లైన్‌ను తాము మార్చలేమని బెంచ్ పేర్కొంది. దర్యాప్తు సంస్థకు తన వాదన వినిపించేలా అవకాశం ఇవ్వాలని సునీత అభ్యర్థించారు. అది ఆ సంస్థ ఇష్టమని అందుకే జులై 3కు విచారణ వాయిదా వేస్తున్నట్టు బెంచ్‌ పేర్కొంది. 


హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టిందని బెంచ్‌కు సునీత తెలియజేశారు. దీనిపై స్పందించిన బెంచ్‌ నోటీసులు ఇచ్చేందుకు తాము సిద్దంగా లేమని పిటిషనర్ కోరినందున తర్వత విచారణ జూన్ 19న చేపడతామని చెప్పింది బెంచ్.