Vikarabad News: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శిరీష మృతి కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఇంట్లో జరిగిన గొడవనే ఆత్మహత్యకు కారణం అని పోలీసులు భావిస్తున్నా.. గ్రామస్థులు మాత్రం కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. ఆదివారం వైద్యాధికారిణి వైష్ణవి పర్యవేక్షణలో పోస్టుమార్టం జరిగిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


శిరీష మృతి కేసులో అక్క భర్త అనిల్ పై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో శిరీష మృతదేహాన్ని మరోసారి పరిశీలించాలని పోలీసులు కోరడంతో వైద్యాధికారిణి కాళ్లాపూర్ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లడంతోనే మృతి చెంది ఉంటుందని పోలీసులకు, గ్రామస్థులకు ఆమె వివరించారు. మరోసారి మృతదేహాన్ని పరీక్షించాల్సిన అవసరం ఏంటని గ్రామస్థులు, బంధువులు పోలీసులు ప్రశ్నించారు. ఇదే సమయంలో తండ్రి జంగయ్యను అంతా గట్టిగా నిలదీశారు. శిరీష మృతికి ఆయనే కారణం అంటూ గ్రామస్థులు ఫైర్ అవ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడే ఉన్న ఎస్సై విఠల్ రెడ్డి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. 


ఇద్దరూ చేయి చేసుకోవడంతోనే మనస్తాపం చెందిన శిరీష


శనివారం రాత్రి శిరీషను ఆమె అక్క భర్త అనిల్, తండ్రి జంగయ్య కొట్టి ఆమె వద్ద ఉన్న ఫోన్ తీసుకున్నారు. దాంతో మనోవేదనతో ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించగా.. వారు అడ్డుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే శిరీష ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇద్దరూ చేయి చేసుకోవడంతోనే మనస్తాపం చెంది కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే కళ్లకు కర్రలు తగిలి గాయాలు అయ్యి ఉంటాయని భావిస్తున్నారు. అలాగే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి మృతి చెంది ఉంటుందని చెబుతున్నారు. ఈ కేసును ఛేదించేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశామని సీఐ వెంకట్రామయ్య తెలిపారు. ఆమె వాడిన ఫోన్ కాల్ లిస్టును సేకరించామని, అందులో ఆధారాలు లేవన్నారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కాళ్లాపూర్ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శిరీష అన్న శ్రీకాంత్ తో మాట్లాడారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేశారు. 


డీజీపీని ఆదేశించిన రేఖా శర్మ..


వికారాబాద్ జిల్లాకు చెందిన శిరీష మృతిపై సమగ్ర వివరాలతో మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు డీజీపీకి ఛైర్ పర్సన్ లేఖ రాశారని ఎన్ సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డీజీపీకి సూచించారు. 


అసలేం జరిగిందంటే?



వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శిరీష.. శనివారం (జూన్ 10) రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపు అవుతున్నా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. తెలిసిన స్నేహితులు, బంధువులు అందరికీ ఫోన్ లు చేశారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం రోజు ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో శిరీష శవమై తేలింది. విషయం గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే శిరీష మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో ఆమెను ఎవరో హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సై విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ముందుగా హత్య చేసి ఆ తర్వాతే మృతదేహాన్ని కుంటలో పడేసినట్లు పోలీసులు చెబుతున్నారు. శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. అయితే ఈమెను ఎవరు, ఎప్పుడు, ఎలా చంపారో త్వరలోనే తేలుస్తామని పోలీసులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.