Top Headlines Today:
నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు
ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 13న విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు జూన్ 13న సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ సప్లిమెంటరీ ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నారు. ఈ ఏడాది మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. పదిరోజుల్లో మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాల వెల్లడకి సిద్ధమైంది ఇంటర్ బోర్డు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. https://resultsbie.ap.gov.in/
టీఎస్‌ఈసెట్-2023 ఫలితాలు
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాల్లో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 13న వెలువడనున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి జూన్ 13న మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 22వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంటారు. https://ecet.tsche.ac.in/
మియామీ కోర్టుకు ట్రంప్
అక్రమ రీతిలో రహస్య పత్రాలు తరలించారన్న అభియోగాలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నమోదు అయ్యాయి. గత ఆగస్టులో ఆయన ఇంట్లో సోదాలు చేసి 11 వేల పత్రాలు సీజ్ చేశారు. అందులో చాలా రహస్య పత్రాలు ఉన్నట్టు తేలింది. ఈ కేసులో విచారణకు ఇవాళ మియామి కోర్టులో ఆయన హాజరుకావాల్సి ఉంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ZEE ఎంటర్‌టైన్‌మెంట్: ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర గోయెంక, జీ ఎంటర్‌టైన్‌మెంట్ హెడ్ పునీత్ గోయెంక 1 సంవత్సరం పాటు మేనేజ్‌మెంట్‌లో ఎటువంటి కీలక పదవులు నిర్వహించకుండా సెబీ నిషేధించింది.
గో ఫ్యాషన్: సీఖోయా క్యాపిటల్, సోమవారం, బల్క్ డీల్స్ ద్వారా గో ఫ్యాషన్‌లో (ఇండియా) తన మొత్తం 10.18% వాటాను విక్రయించింది. రెండు దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థలు BNP పారిబాస్ ఆర్బిట్రేజ్, ICICI ప్రూ లైఫ్ ఇన్సూరర్, రెండు విదేశీ పెట్టుబడి సంస్థలు సొసైటీ జనరల్, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఫండ్ ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లను కొన్నాయి.
పంజాబ్ & సింధ్ బ్యాంక్: 12 నెలల వ్యవధిలో, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో బాండ్ల జారీ ద్వారా రూ. 750 కోట్ల వరకు సమీకరించడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించింది.
ఇంజినీర్స్ ఇండియా: 40 నెలల ప్రాజెక్ట్ షెడ్యూల్‌తో సుమారు రూ. 472 కోట్ల విలువైన ఆర్డర్‌ను ONGC నుంచి ఇంజినీర్స్ ఇండియా దక్కించుకుంది.
JSW స్టీల్: గోవాలో ఇనుప ఖనిజం మైనింగ్ లీజు మంజూరులో, JSW స్టీల్‌ను గోవా రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రాధాన్య బిడ్డర్‌గా ప్రకటించింది.
గ్రీవ్స్ కాటన్: తమ కంపెనీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌లు కొనేవాళ్ల కోసం ఆకర్షణీయ రుణ ఫైనాన్సింగ్ ఆప్షన్‌లు అందించడానికి బైక్ బజార్ ఫైనాన్స్‌తో గ్రీవ్స్ కాటన్ అనుబంధ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది.
HFCL: దిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ IVలో, మూడు ప్రయారిటీ కారిడార్‌ల కోసం ఫైబర్ ఆప్టిక్స్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (FOTS) డిజైన్, తయారీ, సరఫరా, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, ప్రారంభం కోసం దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుంచి రూ. 80.92 కోట్ల విలువైన ఆర్డర్‌ను HFCL పొందింది.
కాప్లిన్ పాయింట్: cisatracurium besylate ఇంజెక్షన్‌ను అమెరికాలో మార్కెట్ చేయడానికి USFDA నుంచి ఈ కంపెనీకి ఆమోదం లభించింది.
టాటా మోటార్స్: టాటా మోటార్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ 3 బిలియన్ పౌండ్ల వార్షిక పెట్టుబడిని ప్లాన్ చేస్తోంది. FY26 నాటికి 30 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది.
ఐనాక్స్ విండ్ ఎనర్జీ: మాతృ సంస్థ ఐనాక్స్ విండ్‌తో విలీనానికి ఐనాక్స్ విండ్ ఎనర్జీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కింద, ఐనాక్స్ విండ్ ఎనర్జీలో ఉన్న ప్రతి 10 షేర్లకు ఐనాక్స్ విండ్ నుంచి 158 ఈక్విటీ షేర్లను కేటాయిస్తారు.