Boys Viral Video on Revanth Reddy: వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్తా బురద మయమై, వర్షపు నీటితో గుంతలమయంగా మారాయి. అధ్వానంగా మారిన రోడ్లను చూసి ఇద్దరు బాలురు ఓ వీడియోను విడుదల చేశారు. విశ్వజిత్ అనే 8 సంవత్సరాలు బాలుడితో పాటు మరో పిల్లాడు ఈ వీడియోలో ముఖ్యమంత్రిని రోడ్ల బాగు కోసం అభ్యర్థించారు. మేడ్చల్ జవహర్ నగర్ లోని 28వ డివిజన్ శ్రీ లక్ష్మీనరసింహ కాలనీలోని రోడ్లన్నీ బురద మయంతో ఉన్నాయని.. తద్వారా వచ్చే పోయే వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారని బాలురు వివరించారు.


రోడ్లపై నడిచే పాదాచారులు కూడా ఇబ్బంది పడుతున్నారని.. ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరు పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ బురదతో ఉన్న రోడ్ల వల్ల కాలనీలో ఉన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నా కూడా రోడ్లు వేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపిస్తే పనులు చేస్తారని, తమ తల్లిదండ్రులకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పానంటూ బాలుడు వీడియోలో చెప్పాడు.


కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి, శ్రీ లక్ష్మీనరసింహ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని కోరుతున్నామని అన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ.. ప్లీజ్ తాతయ్య మా కాలనీకి సీసీ రోడ్లు వేయండి.. ప్లీజ్ ప్లీజ్ అంటూ ఈ బుడ్డోడు చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో తెగ వైరల్ అవుతున్నాయి. 


అయితే, ఈ బుడ్డోళ్ల మాటలు విని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఏమైనా స్పందన వస్తుందా..? అనే దానిపై స్థానికులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ కాలనీల్లో రోడ్లు వేయాలని వారు ఆశిస్తున్నారు.