Telangana IAS Officer Smita Sabharwal: ఆల్‌ ఇండియా సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ తెలంగాణ సీనియస్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెను దమారాన్ని రేపుతోంది. అన్ని వర్గాల నుంచి ఆమెను ప్రశ్నలు ఎదురవుతున్నాయి. న్యాయవాదులు, ఎంపీలు, ఇతర సంఘాలు ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. 


పూజా ఖేడ్కర్‌ ఇష్యూపై స్పందించిన స్మితా సబర్వాల్‌... తన వ్యక్తిగత ఎక్స్‌ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. " ఈ చర్చ మరింత విస్తృతం అవుతున్న వేళ దివ్యాంగులను గౌరవిస్తూనే... విమానయాన సంస్థల్లో  పైలట్‌గా దివ్యాంగులను తీసుకుంటారా? అలాంటి వ్యక్తి సర్జన్‌గా ఉంటే మీరు ఆ వ్యక్తిపై నమ్మకంతో ఉంటారా? ఆల్‌ ఇండియా సర్వీసులైనా ఐఏఎఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్ అంటేనే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లాలి. గంటలు గంటలు పని చేయాలి. ప్రయాణాలు చేయాలి. ప్రజల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఓపికతోపాటు శారీరక దృఢత్వం చాలా అవసరం. ఇలాంటి వాటికి దివ్యాంగుల కోటా అవసరమా అని నేను అడుగుతున్నాను" అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 






ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటల్లోనే తీవ్ర దుమారం రేపింది. అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. స్మితాసబర్వాల్ ట్వీట్‌పై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌ కరుణ స్పందిస్తూ... ఈ ఐఏఎస్‌ అధికారికి వైకల్యం గురించి అంతగా అవగాహన లేదనిపిస్తోంది. చాలా వైకల్యాలు స్టామినా, తెలివితేటలపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇలాంటి వాళ్లకు జ్ఞానోదయం చాలా అవసరం అని ఈ ట్వీట్‌ రుజువు చేస్తోంది. అని తీవ్రంగా స్పందించారు. 






కరుణ ట్వీట్‌కు స్మితా సబర్వాల్ రియాక్ట్ అయ్యారు... "నాకు ఉద్యోగ అవసరాల గురించి తెలుసు. ఇక్కడ సమస్య గ్రౌండ్ జాబ్‌కు సంబంధించిన  అనుకూలతపై మాత్రమ చర్చ. ప్రభుత్వంలోని డెస్క్, థింక్ ట్యాంక్ స్వభావం కలిగిన ఇతర సేవలకు ఇలాంటి వాళ్లు బాగా సరిపోతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి ఓ నిర్ణయానికి రావద్దు. అని అన్నారు. 


ఈ పోస్టు చూస్తుంటే బ్రూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలతో, ప్రత్యేక అధికారులు ఎలా ఆలోచిస్తారో తెలియజేస్తుందని అన్నారు ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఈ పోస్టుపై కూడా స్మితా సబర్వాల్ స్పందించారు... పాలనకు సంబంధించిన సమస్యలపై తగిన గౌరవంతో బ్యూరోక్రాట్‌లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? నా ఆలోచనలు, ఆందోళన నా 24 ఏళ్ల అనుభవం నుంచి వచ్చినవే. " అని అన్నారు.