Actor Mohan Babu News: మంచు కుటుంబంలో మొదలైన తుపాను సునామీగా మారింది. మంగళవారం రాత్రి వరకు మోహన్ బాబు వర్శెస్‌ మనోజ్‌ అన్నట్టు సాగిన వివాదం ఒక్కసారిగా మరో టర్న్ తీసుకుంది. మీడియా ప్రతినిధులపై దాడితో మోహన్ బాబు వర్శెస్‌ మీడియాగా పరిస్థితి మారిపోయింది. కుటుంబంలో ఉన్న వివాదంపై ప్రశ్నించిన మీడియాపైనే దాడికి మోహన్ బాబు తెగబడటంతో విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. ఒకే రోజులు రెండు సార్లు మీడియా ప్రతినిధులపై దాడుల చేశారని మాట వినిపిస్తోంది.  


నాలుగు రోజుల నుంచి రగులుతున్న వివాదం 


మూడు రోజులుగా ఆస్తుల విషయంలో మంచు ఫ్యామిలీలో ఏర్పడ్డ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తలెత్తిన విభేదాలు ఇప్పుడు రోడ్డు ఎక్కేశాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్‌ ఫిర్యాదు చేస్తే తనపై చేయి చేసుకున్నాడని మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. ఇలా పరస్పరం ఫిర్యాదులతో వివాదం బయటకు వచ్చింది. 


విష్ణు రాకతో మరింత రచ్చ- రాత్రి హైడ్రామా


అప్పటి వరకు విదేశాల్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ రావడంతో వివాదం మరింత రాజుకుంది. మంచు మనోజ్‌కు సిబ్బందిని, బౌన్సర్లను బయటకు పంపేశారు. దీనిపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తండ్రి ఎదుటే ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వారిస్తున్నా ఇద్దరూ తగ్గలేదని సమాచారం. విషయం పెద్దది అవుతుందని మధ్యవర్తులు సర్దిచెప్పేందుకు నిన్నంతా మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిపారు. ఈ చర్చలు జరుపుతున్న వేళే మనోజ్‌ ఆగ్రహంతో బయటకు వచ్చేశారని బాగొట్టా. మళ్లీ కాసేపటికి భార్యతో కలిసి మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడే హైడ్రామా మొదలైంది. 


మీడియాపై మోహన్ బాబు దాడి 


మోహన్ బాబు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న మనోజ్, మౌనిక దంపతులను సెక్యూరిటీ లోపలికి రానివ్వలేదు. దీంతో తన అనుచరులతో వచ్చిన మనోజ్‌ గేట్‌ను బలవంతంగా తోసుకొని ఇంటి లోపలికి ప్రవేశించాడు. ఎదురుగా వస్తున్న మోహన్ బాబు వచ్చి అడ్డుకున్నారు. మనోజ్ గేట్‌ను లోపలికి తోసుకు వెళ్లేటప్పుడే మీడియా ప్రతినిధులు కూడా వారితో వెళ్లిపోయారు. ఎదురుగా వస్తున్న మోహన్ బాబును చూసి మీడియా ప్రశ్నలు సంధించింది. అప్పటికే తన ఫ్యామిలీపై మీడియాలో వస్తున్న కథనాలతో ఆగ్రహంగా ఉన్న మోహన్ బాబు వారిపై దాడి చేశారు. మైక్‌ను లాక్కొని విసిరికొట్టారు. దీంతో ఓ మీడియా ప్రతినిధి గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


మోహన్ బాబుపై కేసులు 


మోహన్ బాబు ప్రవర్తను మీడియా సంఘాలు, రాజకీయ నాయకులు ఖండించారు. మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనపై కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. పహాడీ షరీఫ్ పోలీస్‌ స్టేషన్‌లో మోహన్‌ బాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 118 కింద కేసు రిజిస్టర్ చేశారు. అంతే కాకుండా ఆయనకు కేటాయించిన బౌన్సర్లను బైండోవర్ చేయనున్నారు. గన్‌ కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. దాడి ఘటనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖండించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. గాయపడిన జర్నలిస్ట్‌కు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆదేశించారు. 


పోలీస్‌ విచారణకు రానట్టే


కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు దంపతులు ఆసుపత్రి పాలైనట్ట వార్తలు వస్తున్నాయి. గొడవలతో కలత చెందిన మనోజ్‌ తల్లి సాయంత్రమే అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు చెబుతున్నారు. మరో వైపు తన నివాసంలో మనోజ్ చేసిన హంగామా, మీడియా ప్రతినిధులపై దాడి అనంతరం మోహన్ బాబు కూడా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇద్దర్నీ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా మోహన్ బాబు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావడం లేదని సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.