Hyderabad Drugs News: జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ షేక్ బిలాల్ అనే వ్యక్తి కస్టమర్స్ కు గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి 15 గ్రాముల డ్రగ్స్, 22 కేజీల గంజాయి, 71 నిట్రోసన్ టాబ్లెట్స్, అర కిలో హాష్ ఆయిల్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ కేసు గురించి మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 


పక్కా సమాచారంతో షేక్ బిలాల్ ను పట్టుకున్నాం. మాదకద్రవ్యాలు తెచ్చి హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులకు విక్రయించే వాడు. కస్టమర్స్ కి గంజాయి అమ్మడం కోసం జొమాటో డెలివరీ బాయ్ గా షేక్ బిలాల్ జాయిన్ అయ్యాడు. రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఏపీలోని అరకు నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయించేవాడు. ఇంటర్ లో ఉన్నప్పుడే గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు. కరోనా తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చాడు. గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. 


జైలు నుంచి వచ్చాక అతను మళ్ళీ డ్రగ్స్ సరఫరా మొదలు పెట్టాడు. షేక్ బిలాల్ కు దాదాపు యాభై మంది కస్టమర్స్ ఉన్నారు. వీళ్లంతా స్నాప్ చాట్, టెలిగ్రామ్, వాట్సప్ ద్వారా షేక్ బిలాల్ కు కాంటాక్ట్ అయి ఉంటూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. మేం వారిని కూడా గుర్తించి ఆ కస్టమర్స్ అందరికీ టెస్ట్ లు నిర్వహించి.. పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాం’’ అని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్న మంది ఐటీ ఉద్యోగులను రీహాబిలిటేషన్ కు తరలిస్తామని చెప్పారు.