SLBC Tunnel News: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్ 14వ రోజుకు చేరుకుంది. గత పదమూడు రోజులుగా నిర్విరామంగా శ్రమిస్తున్నా కనీసం లోపల చిక్కుకున్న 8మంది కార్మికులలో ఒక్కరంటే ఒక్కరి ఆనవాళ్లు కూడా లభించలేదు. ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎప్పుడు బయటకు వస్తారు? ఇలా ఈ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం దొరకలేదు.
కేరళ నుంచి వచ్చిన ట్రైన్డ్ డాగ్స్
ప్రమాదం జరిగినప్పుడు వారం పదిరోజుల్లో కార్మికుల ఆచూకి తేలిపోతుందని మొదట్లో అంతా అనుకున్నారు. అది కాస్త రోజులు గడుస్తూ ఇప్పుడు ఏకంగా 14వ రోజుకు చేరుకుంది. అలా అని సిబ్బంది సరిగా పని చేయడం లేదా అంటే మూడు షిఫ్టుల్లో ఐదు నుంచి 10 మంది చొప్పున నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఇంకా రెస్య్కూ ఆపరేషన్ ఓ కొలిక్కిరాలేదు సరికదా, లోపల చిక్కుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు కూడా ఆశలు వదులుకుని వెనుదిరిగి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు.
ప్రమాదం జరిగి రెండు వారాలు పూర్తి అయినందున రెస్య్కూ టీంలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాయి. లోపలకు మనుషులను పంపడం, యంత్రాలతో టన్నెల్ క్లియర్ చేయడం అంటే సమయం పట్టే ప్రక్రియ. దీంతో లాభం లేదని అనుకున్న అధికారులు కేరళ నుంచి ప్రత్యేకంగా కెడావర్ డాగ్స్‌ను రప్పించారు. రెండు బృందాలుగా ఈ డాగ్స్‌ను టన్నెల్ లోపలికి పంపారు. లోపల అణువణువూ గాలిస్తాయి. అంతే కాదు వాసనలు త్వరగా కనిపెట్టడం, అతి సూక్ష్మ శబ్ధాలు గ్రహించడం వీటి స్పెషాలిటీ. ముఖ్యంగా 15మీటర్ల లోతులో ఉన్న మనుషులను కూడా గుర్తించగలవు.
వరద సమయంలో ఉపయోగపడ్డ కెడావర్ డాగ్స్
ఇటీవల కేరళలోని వాయునాడ్ వరద విపత్తు సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న మనుషులను, మృతదేహాల గుర్తింపులో ఈ కెడావర్ డాగ్స్ చాలా హెల్ప్ అయ్యాయి. కేరళ పోలీసులు వీటికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. అవే ఇప్పుడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్‌లో కీలకంగా మారుతున్నాయి.
Also Read: SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
టెన్నెల్‌లో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన కెడావర్ డాగ్స్
కెడావర్ డాగ్స్‌ను టన్నెల్ లోపలకి పంపారు. లోపల అణువణువూ శోధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా 13 రోజుల క్రితం 8 మీటర్ల మురద, మట్టిలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఈ జాగిలాలు ఉపయోగపడునున్నాయి. కాసేపట్లో కార్మికులు ఎక్కడ చిక్కుకున్నారో అనే ఆనవాళ్లు ఈ జాగిలాలు ఇచ్చే సంకేతాలు ఆధారంగా కనిపెట్టి, ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేసేందుకు రెస్య్కూ సిబ్బంది సిద్ధంగా ఉంది.
టీబీఎం శకలాల తొలగింపు పూర్తి
టన్నెల్ ప్రమాదంలో ధ్వంసమైన టీబీఎం(టన్నెల్ బోరింగ్ మిషన్) శకలాల తొలగింపు చివరి దశకు వచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే మెకానికల్ ఇంజనీర్లు టిబిఎం విడిభాగాలు తొలిగించి ఒక్కొక్కటిగా టన్నెల్ బయటకు తెస్తున్నారు. టిబిఎం తొలిగించిన తరువాత టన్నెల్ లోపలకి మినీ ప్రొక్లెయిన్లు పంపడం సులభం అవుతుంది. అప్పుడు లోపల ఉన్న మట్టి దిబ్బలను బయటకు పంపింగ్ చేస్తారు. గత 13 రోజులుగా టన్నెల్ లోపల మాన్యువల్‌గా జరిగిన తవ్వకాలు, ఇకపై మిషనరీతో చేయబోతున్నారు. ఇప్పటికే జిపిఆర్ స్కానర్ ద్వారా అనుమానిత ప్రాంతాలు గుర్తించి, వాటిలో 4 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు.
రోబోటిక్ మిషనరీ బృందాలు కూడా టన్నెల్ లోపల కార్మికులను వెతికే పనిలో ఉన్నాయి. ఇలా ఓవైపు కేరళ నుంచి రప్పించిన కెడావర్ డాగ్స్, మరోవైపు రెస్య్కూ టీమ్స్ కలసి సాధ్యమైనంత వేగంగా కార్మికుల ఆచూకిపై స్పష్టత ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం