TGRTC Employees | హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సిబ్బందికి 2.5 శాతం డీఏ (DA For RTC Staff) ప్రకటించారు. తాజా ప్రకటనతో తెలంగాణ ఆర్టీసీపై ప్రతి నెలా రూ.3.6 కోట్ల అదనపు బారం పడుతుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు
మహిళా సాధికారత దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఆడబిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతిగా ఇందిరా మహిళా శక్తి బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉమెన్స్ డే (Womens Day) సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతలో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

తొలి విడతలో 150 మహిళా సంఘాలకు బస్సులు
మొదటి విడతలో 150 మండల మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులను ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన మహిళా సమాఖ్యలకు తరువాత దశలో బస్సులకు కేటాయించనున్నారు. మిగిలిన 450 మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 600 ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకున్నారు.
ఉమెన్స్ డే రోజు మహిళా సంఘాలకు బస్సులు అప్పగింత
ఆర్టీసీ ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ. 77,220 చొప్పున అద్దె చెల్లించనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ప్రారంభించనున్నారు.