Call Center for LRS in Telangana | హైదరాబాద్: అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మొత్తం ఫీజు చెల్లించిన వారికే 25 శాతం రాయితీ వర్తిస్తుందని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మార్చి 31 లోగా ఎల్ఆర్ఎస్ పూర్తి ఫీజు, ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించిన వారికి 25 శాతం మేర రాయితీ వర్తిస్తుందని తెలిపారు. టిఆర్ఎస్ హయాంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (Layout Regularisation Scheme) ప్రకటించారు. దరఖాస్తులకు ఆహ్వానించగా తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మేర అప్లికేషన్లు వచ్చాయి. 


అర్హత లేని ప్లాట్లకు ఫీజు రిఫండ్..


అనధికారిక లేఔట్లలో ఉన్న తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూసినవారికి ఇది మంచి అవకాశం. తెలంగాణ ప్రభుత్వం LRS దరఖాస్తుదారులకు శుభవార్త చెప్పింది. గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న LRS దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితాలో లేని, చెరువులు కుంటలు వాటి బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ పరిధిలో లేని ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ కు అనుమతిస్తున్నారు. చెరువులకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ప్లాట్లకు మాత్రమే రెవెన్యూ శాఖ ఇటు నీటి పారుదల శాఖ అనుమతి తప్పనిసరి చేశారు. LRS కు అర్హత లేని ప్లాట్ లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజులో 90 శాతం వరకు రిఫండ్ చేయనున్నారు. మిగతా 10 శాతం మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకుంటారు. నిర్ణీత గడువులోగా మొత్తం ఫీజు చెల్లించిన వారికి ఎల్లారం జారీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక లే అవుట్ లలో కనీసం 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయితేనే మిగతా 90% ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ కు అనుమతి లభిస్తుంది.



ఎల్ఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్..
ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలో దాదాపు 8లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొన్నేళ్ల కిందట ఎల్ఆర్ఎస్ ప్రకటించినా, ఇప్పటికీ అందులో ముందడుగు పడలేదని దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. అందుకే తాజాగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులపై నెలకొన్న సందేహాలు తీర్చేందుకు 1800599838 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఒక్క రోజులోనే దాదాపు 500 వరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలుస్తోంది. అన్ని కాల్స్ అటెంప్ట్ చేసి వారికి వివరించడానికి సిబ్బందికి కూడా ఊపిరి సలపడం లేనట్లు పరిస్థితి మారుతోంది. బీఆర్ఎస్ హయాంలో 2020లో ఎల్ఆర్ఎస్ కోసం ప్రకటన చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 25.60 లక్షల మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 


ఈ అంశాలు గుర్తుంచుకోండి..


- ఎల్ఆర్ఎస్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31 లోగా పూర్తి ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు లాంటివి చెల్లిస్తేనే 25 శాతం వారికి వర్తిస్తుంది.
- అనధికారిక లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ పథకం తీసుకొచ్చారు. అయితే గతంలో కనీసం ఆ లేఅవుట్లలో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితేనే ఎల్ఆర్ఎస్ కు అర్హులుగా భావిస్తారు. ఆ లేఅవుట్లలో మిగతా ప్లాట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి కానుంది. పది శాతం కంటే తక్కువ ప్లాట్లు రిజిస్ట్రర్ అయిన లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ కు అర్హత సాధించవు.
- నిషేధిత స్థలాలు, చెరులు, ఇతర జలాశయాలకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ప్లాట్లు సైతం ఎల్ఆర్ఎస్ కింద రెగ్యూలరైజ్ చేసుకోవడం కుదరదు. చెరువులు, జలాశయాలకు 200 మీటర్ల లోపు ప్లాట్లు ఉంటే నీటి పారుదల, రెవెన్యూ శాఖ నుంచి పర్మిషన్ వస్తేనే రెగ్యులరైజ్ సాధ్యపడుతుంది.


Also Read: Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే!