Barkat Ali khan Funeral: టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఎనిమిదో నిజాం బర్కత్ అలీ ఖాన్ ముకరం ఝా బహదూర్ శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఎనిమిదో నిజాం భౌతిక కాయాన్ని ఆయన తండ్రి అజమ్ ఝా సమాధి పక్కనే ఖననం చేయనున్నారు.
ముకరం ఝా భౌతిక కాయాన్ని ఇస్తాంబుల్ నుంచి ఈ రోజు సాయంత్రానికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రానుంది. అక్కడి నుంచి పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌కు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. రేపు బుధవారం (జనవరి 18) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సాధారణ ప్రజలకు ఆయన భౌతిక కాయాన్ని చూసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మక్కా మసీదుకు తరలిస్తారు. ముకర్రమ్ ఝా కోరిక మేరకు ఆయన తండ్రి అజమ్ ఝా సమాధి పక్కనే అంత్యక్రియలు చేస్తారు. మక్కా మసీదులోనే దక్షిణ భాగంలో అజమ్ ఝా సహా అసఫ్ జాహీ కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి. అక్కడే ముకరం ఝా భౌతిక కాయాన్ని కూడా ఖననం చేయనున్నారు.
హైదరాబాద్ ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్‌కి ఇద్దరు కుమారులు ఆజాం ఝా, మౌజంఝా. ఈ ఇద్దర్నీ కాదని ఏడో నిజాం తన మొదటి కొడుకు కుమారుడైన ముకరం ఝాను 8వ నిజాంగా ప్రకటించారు. 1971 లో భారత ప్రభుత్వం రాజాభరణాలు రద్దు చేసే వరకూ ముకరం ఝాను అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు. ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ కు నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ముకరం ఝా తండ్రి ఆజాం ఝా, తల్లి దుర్రె షెహవార్ (ఈమె టర్కీలోని ఒట్టోమాన్ సామ్రాజ్య ఆఖరి సుల్తాన్ అబ్దుల్ మెజిద్ కూతురు).
ఇస్తాంబుల్‌లో అద్దె ఇంట్లో మరణం
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) అప్పట్లో గొప్ప సంపదతో ప్రపంచ కుబేరుడిగా ఉండేవారు. ఆయన వారసుడైన మనవడు (మొదటి కుమారుడి కొడుకు) ముకరం ఝా (ప్రస్తుతం చనిపోయిన వ్యక్తి) ఎనిమిదో నిజాంగా చిన్నప్పుడే ప్రపంచ కుబేరుడిగా మారారు. అదే సమయంలో వారసత్వ ఆస్తులతో విలాసాలు, డాబు దర్పాలకు పోయి దివాళా తీశారని చెబుతారు. ఆయనకు ఉన్న నలుగురి భార్యలతో విభేదాల కారణంగా వివిధ కేసులు, ఆస్తి తగాదాలతో బాగా ఇబ్బంది పడ్డారని చెబుతారు. ఆయన సంతానం, హైదరాబాద్‌లో ఉండే బంధువులు తదితరులు ఆస్తి కోసం కోర్టుకు వెళ్లడం లాంటి పరిణామాలూ జరిగాయి. దీంతో ఆ ఆస్తులను అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అలా ఎనిమిదో నిజాంకు దాదాపు చేతిలో డబ్బులు కూడా లేని స్థితి ఎదురైందని చెబుతారు. అలా ఇస్తాంబుల్‌లో ఓ డబుల్ బెడ్ రూం ఇల్లు అద్దెకు తీసుకొని ఉండేవారని ఆస్ట్రేలియాకు చెందిన ఓ రచయిత, రీసెర్చర్ జాన్ జుబర్‌జికి తెలిపారు. ఆయన The Last Nizam అనే పుస్తకాన్ని రాశారు. The Raise and Fall of India's Greatest Princely State గురించి ఉన్న ఈ పుస్తకంలో ఎనిమిదో నిజాం అద్దె ఇంటికే పరిమితమైనట్లుగా రాశారు.