KTR Tweet: గత ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంపై చర్చించారు. కరోనా నేపథ్యంలో మూడేళ్ల తర్వాత నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జైశంకర్ కూడా హాజరయ్యారు.
సమావేశాల బహిష్కరణ..
అయితే నీతి ఆయోగ్ సమావేశాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి భేటీని ఆయన బహిష్కరించారు. జాతీయ ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నీతి ఆయోగ్ తో ఉపయోగం లేదని కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతకు ముందు వెల్లడించారు. నీతి ఆయోగ్ తీసుకువచ్చిన మొదట్లో అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారని, ప్రధాని నేతృత్వం వహిస్తారని, అప్పట్లో దానిని టీమిండియాగా అభివర్ణించారని కేసీఆర్ గుర్తు చేశారు. దాంతో తాను చాలా సంతోషపడ్డానని, ఆశపడ్డానని, దేశానికి మంచి రోజులు వచ్చాయని భావించానని తెలిపారు. నీతి ఆయోగ్ పేరుకే ఒక సంస్థలాగా మిగిలిపోయిందని విమర్శించారు.
నేతి బీరకాయలో నేయ్యి లాంటిదే..
'నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్దంగా ప్రవర్తిస్తోంది. ఎనిమిదేళ్లలో నీతి ఆయోగ్ ఏమీ సాధించలేకపోయింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. కానీ పెట్టుబడి వ్యయం రెట్టింపు అయింది. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. తాగడానికి, సాగుకు నీళ్లు దొరకడం లేదు. ఢిల్లీలోనూ నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని' కేటీఆర్ విమర్శించారు. అందుకే తాను నీతి ఆయోగ్ సమావేశాలను బహిష్కరిస్తున్నానని తెలిపారు.
పోయి ఉండాల్సింది - పోయి ఏం లాభం
ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీకి వెళ్లకపోవడాన్ని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ తప్పుపట్టారు. సంధి కుదరదని తెలిసి కూడా శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళిన మహాభారతం నుండి కేసీఆర్ జ్ఞానం పొంది ఉండాల్సిందని ట్విటర్ లో ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి, సీఎంల సమక్షంలో జరిగిన సమావేశంలోనే నీతి ఆయోగ్‌ని సీఎం కేసీఆర్ ప్రశ్నించి ఉండాల్సిందని అని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయిననూ పోయి రావలే హస్తినకు అనేది పాత సామెత అని ట్వీట్ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు బుట్ట దాఖలు చేసిందని అన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతేనని నాగేశ్వర్ ట్వీట్ కు బదులుగా ట్వీట్ చేశారు. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని తెలిపారు.
వివిధ అంశాలపై చర్చలు..
జాతీయ విద్యా విధానం, పంట వైవిధ్యం, పట్టణాభివృద్ధి సహా ముఖ్యమైన అంశాలపై నీతి ఆయోగ్ భేటీలో చర్చించారు. కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా పెంచాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో తమ డిమాండ్లు వినిపించారు. కేంద్ర పథకాల అమలులో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదాలను నీతి ఆయోగ్ పరిష్కరించాలని పలువురు సీఎంలు కోరారు. తక్కువ జనాభా ఉన్న నగరాల సమీప గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం అమలు చేయాలని పలువురు ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా కోరారు.