టీఆర్‌ఎస్‌ని ఢీ కొట్టాలని బలంగా సంకల్పించుకున్న బీజేపీ వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడంలేదు. ఇప్పుడు సినీ గ్లామర్‌ను కూడా యాడ్‌ చేసుకునే పనిలో పడింది. అందుకే వేరే పార్టీల్లో ఉన్నవారిని, న్యూట్రల్‌గా ఉన్న వారిపై ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా అందర్నీ పార్టీలోకి తీసుకొని కండువాలు కప్పేయాలని ఆరాట పడుతోంది. ఇప్పటికే జయప్రద బీజేపీలో చేరి చాలా రోజులు అయింది. ఇప్పుడు సహజనటి జయసుధ కూడా అదే బాట పట్టనున్నారని సమాచారం. 


సహజనటి బీజేపీపి కలిసొస్తుందా? 


ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా వెలిగిన జయసుధ ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  ఆ ఫేజ్‌లో కూడా తనకు పోటీ ఎవరూ లేరని నిరూపించారు. అప్పుడే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 2009లో సికింద్రబాద్‌ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలై కొన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 


2016లో తిరిగి సైకిల్ ఎక్కి టిడిపితో ప్రయాణం చేసిన జయసుధ అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. జగన్‌ చెంతకు చేరారన్న పేరే కానీ అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. అలా రాజకీయాలకు కొన్నాళ్లు గ్యాప్‌ ఇచ్చిన జయసుధకి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఈ సమయంలోనే భర్త ఆకస్మిక మరణం ఆమెను కుంగదీసింది. అందుకే అందరికీ, అన్నింటికీ దూరంగా చాలా రోజులు గడిపారామె. కొడుకు పెళ్లితో మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. అన్ని ఒత్తిళ్లను జయించిన జయసుధ ఈసారి మరింత ఉత్సాహంగా కనిపించారు. మొన్నా మధ్య జరిగిన మా ఎన్నికల గొడవల్లోనూ మోహన్‌ బాబు ప్రత్యేకంగా జయసుధ పేరు ప్రస్తావించడంతో మరోసారి హైలెట్‌ అయ్యారు. 


ఈ మధ్య ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీపై తన స్టైల్‌లో విమర్శలు చేసి మరోసారి జయసుధ తాను ఇంకా లైమ్‌లైట్‌లో ఉన్నానని.. చెప్పకనే చెప్పారు. అదే జోష్‌తో ఇప్పుడు మరోసారి తన రాజకీయ జీవితాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. ఇదే ఇప్పుడు సినీ, రాజకీయవర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈనెల 21న అమిత్‌ షా సమక్షంలో జయసుధ కాషాయం కండువా కప్పుకోనున్నారని సమాచారం. కాషాయం కండువా కప్పుకున్న వెంటనే గతంలో కాకుండా ఈసారి మరింత దూకుడుగా ఉండాలని జయసుధ భావిస్తున్నారట. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్‌ రెడ్డి తరఫున జయసుధ ప్రచారం కూడా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. 


పోటీకి సై అంటేనే ప్రచారానికొస్తా


ప్రస్తుతం బీజేపీలో సినీరంగం తరపున విజయశాంతి, జయప్రద కీ రోల్‌ పోషిస్తున్నారు. ఇప్పుడు సహజనటి రాకతో కాషాయానికి మరింత కళ రానుందని ఆపార్టీ సంబరపడుతోంది. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న జయసుధ ఏమి ఆశించి ఆపార్టీలోకి చేరుతున్నారన్నదే ఇక్కడ ఆసక్తికరమైన పాయింట్‌. ఇంతకుముందు టీఆర్ఎస్‌ నుంచి ఆహ్వానం అందినా జయసుధ అంగీకరించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బీజేపీ ఎలా ఆకర్షించిందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. కొన్ని షరతులతోనే జయసుధ బీజేపీలోకి వస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తను కోరుకున్న స్థానం నుంచే పోటీచేసే అవకాశం ఇస్తేనే పార్టీలోకి చేరతానని చెప్పడం వల్లే కాషాయం కప్పుకుంటున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.