KTR about Women Reservation Bill :
హైదరాబాద్: దాదాపు 3 దశాబ్దాలుగా చట్టంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill )ను కేంద్ర ప్రభుత్వం నేడు (సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కొన్ని విషయాలలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై స్పందించారు. ఈ బిల్లు పట్ల ఓ భారతీయుడిగా తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చే అంశానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
తెలంగాణలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు..
దేశంలో నేడు మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును చట్టంగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో ఎప్పటినుంచో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేశామన్నారు కేటీఆర్. స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు గ్రామ పంచాయతీలలో తాము సగం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నామని మహిళా రిజర్వేషన్ బిల్లుపై తనదైన శైలిలో మంత్రి కేటీఆర్ స్పందించారు.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు కోసం పోరాడిన, ప్రయత్నాలు చేసిన కేంద్ర ప్రభుత్వం, అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు కార్యరూపం దాల్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే మహిళా బిల్లు సాకారానికి తాము సైతం ఎంతగానో కృషి చేశామన్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చే ఇలాంటి అంశాలలో అన్ని పార్టీల నేతలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టంగా మారితే పార్లమెంట్, అసెంబ్లీలు లాంటి చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. తెలంగాణలో తాము మాత్రం స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు స్థానం కల్పించాలని ట్వీట్ లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మా పోరాటం ఫలించింది, మహిళా బిల్లుకు మేం పూర్తి మద్దతిస్తాం - కవిత
కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతోషం వ్యక్తం చేశారు. బిల్లును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. లోక్ సభలో తాము పూర్తిగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలుకుతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెస్తున్నందుకు సంతోషంగా ఉందని కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం కోసం కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై కవిత స్పందించారు. బీఆర్ఎస్ ఈ బిల్లు కోసం ఎప్పటినుంచో పోరాడుతోందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.