Robbery at Secunderabad Gandhi Hospital:


హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద జరిగిన దారి దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలకల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ హాస్పిటల్ మెట్రో రైల్వే స్టేషన్  సోమవారం రాత్రి కత్తి చూపించి నగదు, బంగారం దోపిడీ చేశారు నిందితులు.


అసలేం జరిగిందంటే..
ఖమ్మం జిల్లా వెంసురి మండకంకు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర రావు ఛాతీ నొప్పితో 15 రోజుల కింద నగరంలోని గాంధీ హాస్పిటల్ లో చేరాడు. ఆటోలో తన తమ్ముడు మహేష్, మరదలు రావూరి శ్రిబా తీసుకు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వెంకటేశ్వర రావుకు హాస్పిటల్లో చికిత్స జరుగుతుండగా వీళ్లు అతనికి సహాయంగా ఉంటున్నారు. అయితే తమ ఖర్చుల నిమిత్తం అదే ఆటోను మహేష్ చుట్టుపక్కల ప్రాంతాలకు నడుపుతున్నాడు. భార్య సైతం అతడితోపాటే ఆటోలో తిరుగుతోంది.


ఈ క్రమంలో సోమవారం రాత్రి 11గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ స్టేషన్ నుండి గాంధీ హాస్పిటల్ వైపు వెళుతూ మెట్రో స్టేషన్ వద్ద మూత్ర విసర్జన కోసం ఆటో మహేష్ దిగాడు. ఆటోను వెంబడిస్తూ బైకుపై వచ్చిన యువకులు ఆటోలో ఉన్న మహేష్ భార్యను డమ్మీ పిస్తోల్ తో బెదిరించి మెడలోని బంగారు గొలుసు లాక్కుని పారిపోయే ప్రయత్నం చేయడంతో ఆమె కాసేపు ప్రతిఘటించింది. భార్య కేకలు వేయడంతో పరిగెత్తుకుని వచ్చిన భర్త మహేష్ కు సైతం కత్తి చూపి బెదిరించి అతని వద్ద ఉన్న రూ 2వేల నగదు లాక్కొని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. 


బాధితులు సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చిన తరువాత  ఆటోను అక్కడ పార్కింగ్ చేశారు. గాంధీ హాస్పిటల్ కు షేరింగ్ ఆటోలో వెళదామని రామకృష్ణ హోటల్ వద్ద వేచి చూస్తుండగా తమ వద్ద నగదు లాక్కొని పారిపోయిన వ్యక్తులే చాయి బండి నడుపుతున్న వ్యక్తిని కూడా బెదిరించారని గమనించారు. తమకు జరిగిన ఘటనా గురించి చాయి బండి అతడికి తెలపడంతో వారు కూడా ఆటోడ్రైవర్లేనని బదులిచ్చాడు. 


అనంతరం శ్రీబా తన భర్తతో కలసి చిలకల గూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లోనే కేసును ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద కత్తి, నకిలీ పిస్తోల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ స్పెక్టర్ శంకర్ నాయక్ తెలిపారు. దొంగల దగ్గర ఉన్న బంగారాన్ని బాధిత మహిళకు అందజేశారు. నిందితులు గతంలోనూ చోరీలు చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.