USA: అమెరికా ఐదుగురు పౌరులను రక్షించుకునేందుకు తీసుకున్న నిర్ణయం తెలిస్తే మీ కళ్లు బయర్లు కమ్ముతాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 బిలియన్‌ డాలర్లను వదులుకుంది. దీంతో ఇరాన్‌ చేతిలో బందీలుగా ఉన్న ఐదుగురు అమెరికన్లు ఎట్టకేలకు విడుదల చేయించుకుని స్వదేశానికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేసుకుంది. మామూలుగా ఇదే బందీలుగా ఉన్న పౌరులను విడిపించుకోవడానికి ఆయా దేశాలు చర్చలు జరుపుకుంటాయి. అలాంటి సమయంలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు.


కానీ అమెరికా తన పౌరులను విడుదల చేయించుకోవడానికి 6 బిలియన్‌ డాలర్లను వదులుకోవాల్సి వచ్చింది. అంటే భారత కరెన్సీలో ఆ డాలర్ల విలువ అక్షరాలా రూ.49వేల కోట్లు. అమెరికా, ఇరాన్ బద్ధ శత్రు దేశాలు. ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సుదీర్ఘకాలం విరోధులుగా కొనసాగుతోన్న దేశాల మధ్య ఈ అరుదైన మార్పిడి ఒప్పందం జరిగింది. నలుగురు పురుషులు, ఒక మహిళ మొత్తం ఐదుగురు అమెరికన్లు ఎనిమిదేళ్లుగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు చెందిన అత్యంత క్రూరమైన ఎవిన్‌ జైలులో బందీలుగా ఉన్నారు. దీనిపై అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకు నిరాధారమైన అభియోగాలతో ఇరాన్‌ అమెరికన్లను బందీలుగా మార్చిందని ఆరోపించింది.


అయితే తమ పౌరులను రక్షించుకోవడానికి అమెరికా ఒక అడుగు ముందుకు వేసింది. దీంతో శత్రుదేశాలు ఇరాన్, అమెరికా మధ్య ఖతార్‌(Qatar) మధ్యవర్తిత్వం వహించింది. వివాదానికి పరిష్కార మార్గాన్ని చూపించింది. ఒప్పందం చివరి దశకు చేరుకుంటుందన్న సూచనలు రాగానే ఇరాన్‌ ప్రభుత్వం బందీలుగా ఉన్న ఐదుగురు అమెరికన్లను ఎవిన్‌ జైలు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం గమనార్హం. దక్షిణ కొరియాలో నిలిచిపోయిన ఇరాన్‌కు చెందిన నిధులు దోహా బ్యాంకులకు చేరుకోగానే అమెరికన్ పౌరులు టెహ్రాన్‌ నుంచి దోహాకు వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు.


దానితో పాటుగా అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అమెరికా జైళ్లలో మగ్గుతున్న ఐదుగురు ఇరానియన్లకు కూడా ఈ ఒప్పందంలో భాగంగా క్షమాభిక్ష లభించింది. ఈ ఖైదీల మార్పిడి కోసం సైతం ఖతార్‌ మధ్యవర్తిత్వం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో మొదటి సారి చర్చలు మొదలయ్యాయి. దాదాపు 18 నెలల పాటు తొమ్మిది రౌండ్లలో చర్చలు జరిగాయి. ఇందుకోసం ఖతార్‌ అధికారులు చొరవ తీసుకున్నారు. ఇరాన్, అమెరికా మధ్య సమాచార మార్పిడికి టెహ్రాన్‌, వాషింగ్టన్ మధ్య పలుమార్లు తిరిగారు. ఎట్టకేలకు చర్చలు ఫలప్రదం అవడంతో ఇరు దేశాల మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. దీంతో పాటు అమెరికా 6 బిలియన్ డాలర్లను చెల్లించింది.


దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇరాన్‌ జైల్లో బంధించిన ఐదుగురు అమాయకులైన అమెరికన్లు ఎట్టకేలకు స్వదేశానికి వస్తున్నారని, ఆ ఐదుగురు ఏళ్లపాటు అంతులేని వేదనను అనుభవించారని అన్నారు. తమను కాపాడటానికి బైడెన్‌ అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నారని, రాజకీయాలను పక్కనపెట్టి తమ ప్రాణాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఇరాన్ నుంచి విడుదలైన ఐదుగురు అమెరికన్లు చెప్పారు. బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌కు చెల్లించిన ఆరు బిలియన్ల డాలర్లు అమెరికా ఆంక్షలతో స్తంభించిపోయిన ఇరాన్‌ ఆస్తుల్లో భాగం కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే బైడెన్ నిర్ణయాన్ని రిపబ్లికన్లు ఖండిస్తున్నారు. విడుదలకు డబ్బు చెల్లించడంతో పాటు, ఆంక్షల్లో సడలింపుగా చర్య అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశాలల్లో ఇరాన్‌ ముందు వరసలో ఉంటుందన్నారు.  అలాంటి ఇరాన్‌కు నిధులు బదిలీ చేయడం దారుణమని మండిపడతున్నారు.