Hyderabad Kite Festval: ఈ ఏడాది కూడా ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి 15 వ తేదీ వరకు ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్టు తెలంగాణ పర్యాటకశాఖ ఇప్పటికే పేర్కొంది. ఈ కైట్‌ ఫెస్టివల్‌లో 40 మంది అంతర్జాతీయ కైట్‌ ప్లేయర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఫెస్టివల్‌కు 16 దేశాల నుంచి 40 మందికి అంతర్జాతీయ గాలి పటాలు, 60 మంది జాతీయ పతంగుల క్లబ్‌ సభ్యులు పాల్గొననున్నారు. ఇవి కాకుండా ఈ సందర్భంగా మిఠాయిలు పండగను నిర్వహించనున్నారు. వివిద దేశాల నుంచి పాల్గొనే వాళ్లు తమ స్టాల్స్‌లో జాతీయ, అంతర్జాతీయంగా పేరుగాంచిన స్వీట్లను ఉంచనున్నారు. ఈ గాలి పటాల పండగకు ఉచితంగా ప్రవేశం కల్పింనున్నారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలో గాలి పటాలు ఎగురవేసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణమైన ఏర్పాట్లును చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ ఆంక్షలను పోలీసులు విధిస్తున్నారు. 


ఇవీ ట్రాఫిక్‌ ఆంక్షలు.. 


పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరరాల్లో ఈ ఆంక్షలు ఉంటాయి. ఈ మేరకు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ ఆంక్షల వివరాలను వెల్లడించారు. ఇటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు సాగించాలని అధికారులు సూచించారు. తివోలిక్రాస్‌ రోడ్డు నుంచి ప్లాస్‌ ఎక్స్‌ రోడ్డు వరకు రోడ్డు మూసి వేసి, ట్రాఫిక్‌ను ఉదయం 10 గంటలు నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్లిస్తున్నట్టు వెల్లడించారు. ఆలు గడ్డ బావి ఎక్స్‌ రోడ్డు, సంగీత్‌ ఎక్స్‌ రోడ్‌, వైఎంసీఏ ఎక్స్‌ రోడ్డు, ప్యాట్నీ, ఎస్‌బీహెచ్‌, ప్లాజా, సీటీవో, బ్రూక్‌ బ్రాండ్‌, స్వీకార్‌ ఉపకార్‌ జంక్షన్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌, తాడ్‌బన్‌ క్రాస్‌ రోడ్స్‌, సెంటర్‌ పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌, బోయిన్‌ పల్లి ఎక్స్‌ రోడ్‌, రసూల్‌ పూరా, బేగంపేట్‌, పారడైజ్‌ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్‌, జూబ్లీ బస్‌ స్టాండ్‌ వైపు రాకపోకలు సాగించే ప్రయాణీకులు సాఫీగా వెళ్లేందుకు అనుగునంగా ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. మెట్రో రైలు సర్వీసును ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. ఫెస్టివల్‌కు వచ్చే వాళ్లు వారికి కేటాయించిన పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలను పార్కు చేసుకోవాలని సూచించారు. 


భారీగా హాజరయ్యే అవకాశం.. 
కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌కు వేలాదిగా నగరవాసులు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల్లో సుమారు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, ఇటుగా రాకపోకలు సాగించే వారు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. కాబట్టి, ముందుగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడం వల్ల ప్రయాణీకులకు ఇబ్బందులను తప్పించవచ్చని భావించిన పోలీసులు.. ఈ మేరకు ఆంక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరవాసులు ముఖ్యంగా అటుగా ప్రయాణాలు సాగించేవాళ్లు పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో అమలులో ఉన్న ట్రాఫిక్‌ ఆంక్షలను గుర్తించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 


దేశ, విదేశాల నుంచి.. 
దేశంలోని అనేక రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వేలాది మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి నుంచి భవిష్యత్‌లో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు అనుగుణమైన సూచనలు ఇవ్వాలని కోరనున్నారు. హైదరబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు ఈ ఫెస్టివల్‌ దోహదం చేస్తుందని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.