Engineering Teaching: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధన చేసే అధ్యాపకులు ఇకపై రెండు కాలేజీల్లోనూ పాఠాలు బోధించే వెసులుబాటును ఏఐసీటీఈ కల్పించింది. ఇప్పటివరకు ఒక అధ్యాపకుడు ఒక ఇంజినీరింగ్ కళాశాలలో మాత్రమే పాఠాలు బోధించాలన్నది ఇప్పటివరకు ఉన్న నిబంధన ఉండేది. అయితే కొత్తగా ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే కళాశాలలు మాత్రం వారితో రెండుచోట్ల బోధన చేయించవచ్చు. ఉత్తమ పనితీరు కనబరిచే ఇంజినీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ విశ్వవిద్యాలయం పరిధిలో ఆఫ్ క్యాంపస్‌లు పెట్టుకోవచ్చని ఏఐసీటీఈ నిర్ణయించింది. 


స్వయంప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలు, న్యాక్-ఏ గ్రేడ్ పొందిన కళాశాలలు 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కూడా కొన్ని కళాశాలలు ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు సమాయత్తమవుతున్నాయి. అయితే ఏఐసీటీఈ అనుమతుల నిబంధనావళిలో ఎన్ని ఆఫ్ క్యాంపస్‌లు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధాన కళాశాల ఏ వర్సిటీకి అనుబంధంగా ఉందో.. దాని పరిధిలో మాత్రమే వాటిని ఏర్పాటు చేసుకోవాలి.


జేఎన్‌టీయూహెచ్ అనుబంధంగా ఉండే కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే కళాశాలలు మాత్రం కేవలం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ క్యాంపస్‌లను మొత్తం మూడు కేటగిరీలుగా ఏఐసీటీఈ విభజించింది. ప్రధాన క్యాంపస్‌కు 5 కి.మీ.లోపు దూరంలో ఉండే కళాశాలలు, 75 కి.మీలోపు ఉండే కళాశాలలు, ఆపైదూరంలో ఉండే కళాశాలలు అని మూడు కేటగిరీలను ఏర్పాటు చేయనున్నారు. 


మొదటి కేటగిరీ కింద అధ్యాపకులతో పాటు ఆయా సదుపాయాలైన ప్రయోగశాలలు, క్రీడామైదానాలు లాంటివి రెండు క్యాంపస్‌లు వినియోగించుకోవచ్చు. అంటే ఒక అధ్యాపకుడు ఎక్కడ అవసరముంటే అక్కడ పాఠాలు బోధిస్తారు. ఇక రెండో కేటగిరీలో మాత్రం అధ్యాపకులను ఆఫ్ క్యాంపస్‌కు పంపొచ్చు. కాకపోతే ఒకేరోజు రెండింటిలో బోధించడానికి వీల్లేదు. ఒకరోజు ప్రధాన క్యాంపస్, మరుసటిరోజు ఆఫ్ క్యాంపస్‌లో పాఠాలు చెప్పొచ్చు. ఇక మూడో కేటగిరీ కింద అధ్యాపకులను, వసతులను పంచుకోవడానికి వీల్లేదు.


బీబీఏ, బీసీఏ కోర్సులు, ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్  కోర్సులతో పాటు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్(BBA), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(BCA) కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ వీటిని ప్రవేశపెట్టనుంది. అయితే కోర్సుల అనుమతులకు యూజీసీ నిబంధనలే వర్తిస్తాయని, ఆయా కోర్సులు అందించే కళాశాలలు తప్పనిసరిగా ఏఐసీటీఈ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వైస్‌ ఛైర్మన్‌ అభయ్‌ జెరే స్పష్టం చేశారు.


ఏఐసీటీఈ అనుమతులపై ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు జనవరి 9న ఓయూలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీబీఏ, బీసీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాలని,  ఇక వారి పరిధిలో ఉండదని జనవరి 8న యూజీసీ నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొన్నారు. ఇకనుంచి మంచి పనితీరు కనబరిచే కళాశాలలకు కూడా ఆఫ్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇచ్చామని, సీట్ల సంఖ్యపై కూడా పరిమితి ఎత్తివేశామని తెలిపారు. ఈసారి నుంచి కళాశాలల ప్రతినిధులు ఏఐసీటీఈ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని, తామే కళాశాలల వద్దకు వస్తామని పేర్కొన్నారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...