ఈ ఏడాది ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహాగణపతి కూడా రేపు సాగర్‌లో కలిసిపోనున్నాడు. ఖైరతాబాద్‌లో దశ మహా విద్యాగణపతికి వీడ్కోలు పలికేందుకు... విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్‌లో పూజలందుకున్న శ్రీ దశ మహా విద్యా గణపతి నిమజ్జనం.. రేపు ఉదయం 11గంటల 30 నిమిషాలకు జరుగుతుందని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. శోభాయాత్ర రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటిచింది. ఈరోజు బాలానగర్ నుంచి భారీ ట్రాలీ ఖైరతాబాద్ చేరుకోనుంది. అర్థరాత్రి 12గంటలకు చివరి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒంటి గంట తర్వాత బడా గణపయ్యను.. ప్రతిష్టించిన స్థానం నుంచి కదిలిస్తారు. ఆ తర్వాత... అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల వరకు చిన్న విగ్రహాలను ట్రాలీపైకి ఎక్కిస్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల వరకు భారీ వినాయకుడిని ట్రాలీపై తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత వెల్డింగ్ పనులు చేస్తారు.
ఉదయం 7గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా శోభాయాత్ర సాగుతుంది. నెమ్మదిగా కదులుతూ ఉదయం తొమ్మిదున్నర గంటలకు బడా గణపయ్య ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటాడు. ఉదయం పదిన్నరకు అక్కడ వెల్డింగ్ పనులు జరుగుతాయి. ఆ తర్వాత 11గంటల వరకు వరకు పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. 11గంటల 30 నిమిషాలకు ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. దీంతో శ్రీ దశ మహా విద్యా గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణనాధుడి నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుంది. రేపటి నిమజ్జనానికి ఈ సాయంత్రం నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతున్న కారణంగా... ఈ సాయంత్రం నుంచి ఖైరతాబాద్ గణపయ్య దర్శనాలు నిలిపివేస్తున్నారు.
రేపటి గణేష్ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తోపాటు ప్రధాన చెరువుల దగ్గర నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌లో ఈసారి 90 వేల గణేష్ విగ్రహాలను ఏర్పటుకాగా.. ట్యాంక్ బండ్‌లో 30 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. నిమజ్జనానికి సంబంధించి... భద్రతపరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా నిఘాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు పోలీసులు. శోభాయాత్ర జరిగే మార్గాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పెట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఖైరతాబాద్ బడా గణేష్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసుతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. దీంతో ఆయా మార్గాల్లో నిఘాపెట్టారు. ఓల్డ్‌సిటీ సహా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. శోభాయాత్రను పూర్తిగా సీసీటీవీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకొచ్చారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నారు. శోభాయాత్ర, నిమజ్జనాలను బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిశీలించబోతున్నారు. శోభాయాత్ర జరిగే రూట్‌లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. చార్మినార్, మక్కా మసీదు సహా ఓల్డ్ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్‌పై స్పెషల్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మహిళలకు ఇబ్బంది ఎదురుకాకుండా షీ టీమ్స్, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు.