అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ప్రభుత్వం ఊహించని నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రభుత్వం రెడీ అవుతోంది. గ్రేటర్‌లోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్నవారిలో అర్హుల వివరాలను ప్రకటించనుంది. మొత్తం 36,907 ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్‌ అలీలు వెల్లడించనున్నారు. లక్కీడ్రాలో ఎంపికైన 36,907 మందికి వచ్చే నెల  3, 5 తేదీల్లో ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించనున్నారు. 


తొలివిడతలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11వేల 700 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లను అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదేనని హెచ్చరించడంతో...లక్కీ డ్రాలో జాగ్రత్తగా వ్యవహరించనున్నారు. తప్పు చేసిన అధికారులపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదని  మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అర్హుల ఎంపిక పూర్తిస్థాయి బాధ్యతను ప్రభుత్వం అధికారులకే అప్పగించినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామని స్పష్టం చేశారు.