ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ వేసిన మరో ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు ప్రస్తావించింది. సమీర్‌ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవితతోపాటు, వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి పాత్రను వివరించింది. ఈ కేసులో బోయినపల్లి అభిషేక్‌, బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్టు ఈడీ కోర్టుకు వివరించింది. 


ఇండోస్పిరిట్స్‌ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్‌రెడ్డి, కవిత అని తెలిపింది ఈడీ. ఇండో స్పిరిట్స్‌కు ఎల్‌ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ అభియోగం మోపింది. ఇండో స్పిరిట్‌లో రామచంద్ర పిళ్‌లై వెనుక ఉన్నది కవిత అని ఈడీ తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తరఫున ప్రేమ్‌ రాహుల్‌ పనిచేస్తున్నారని వివరించింది. ఈ సంస్థ 14,05,58,890 సీసాల మద్యం విక్రయించి రూ.192.8 కోట్లు సంపాదించిందని పేర్కొంది.


వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, కె.కవిత, శరత్‌రెడ్డి నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌ రూ.100 కోట్ల ముడుపులను విజయ్‌నాయర్‌కు ఇచ్చిందని ఆరోపించింది. ఆప్‌ నేతల మధ్య కుదిరిన డీల్‌గా వెల్లడించింది. దీని ప్రకారం వంద కోట్లను ముందస్తుగా చెల్లించినట్టు పేర్కొంది వివరించింది. ఈ వంద కోట్లు వసూలకు వీలుగా ఇండోస్పిరిట్‌లో 65 శాతం వాటాను సౌత్‌గ్రూప్‌నకు ఇచ్చింది. ఈ వాటాను అరుణ్‌పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌ అనే బినామీ ప్రతినిధులతో నడిపించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో పాత్ర ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు. ఇందులో కవిత ఫోన్లు పది ధ్వంసమైనట్టు పేర్కొంది. 


అరుణ్‌పిళ్‌లై రూ.3.4 కోట్లు పెట్టుబడి పెట్టి 65శాతం లాభంతో రూ.32.26 కోట్లు వచ్చినట్లు ఈడీ వివరించింది. ప్రేమ్‌ రాహుల్‌ రూ.5 కోట్లు పెట్టినా ఎలాంటి లాభం చూపించలేదని తెలిపిరంది. ఈయన్ని డమ్మీగా చూపించి 65 శాతం వాటాను అరుణ్‌ పిళ్‌లై తీసుకున్నారని ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌ తరఫున సమీర్‌ మహేంద్రు 35శాతం వాటాగా రూ.5 కోట్ల పెట్టుబడితో 35శాతం లాభం పొందారని తెలిపింది. వీరిపై మనీలాండరింగ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది. 


దీనికి సంబంధించిన సమావేశాలు ఢిల్లీతోపాటు హైదరాబాద్‌లో కూడా జరిగినట్టు పేర్కొంది ఈడీ. ఈ జనవరిలోనే కవిత ఇంట్లోనే ఓ సమావేశం జరిగిందని అందులో సమీర్‌ పాల్గొన్నట్టు తెలిపింది. ఈ మీటింగ్‌లో శరత్‌చంద్రారెడ్డి, అరుణ్‌పిళ్లై, అభిషేక్‌, కవిత భర్త అనిల్‌ పాల్గొన్నట్టు తెలిపింది. ఈ లిక్కర్‌ స్కామ్‌లో రూ.10 వేల కోట్ల ఆదాయం ఉందని... దీనికి పెద్దవాళ్లు కావాలంటూ అరుణ్‌ పిళ్లైతో విజయ్‌నాయర్‌ చెప్పినట్టు ఈడీ పేర్కొంది. ఇంతలో శరత్‌చంద్రారెడ్డి వ్యాపారం పట్ల ఆసక్తి చూపారు. ఆయనే బుచ్చిబాబును ఇందులోకి తీసుకొచ్చారు.


సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. నవంబర్‌ 26 దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌పై ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ విచారణ చేపట్టారు. దీనిపై కౌంటర్‌ వేయాలని సమీర్‌ మహేంద్రుతోపాటు నాలుగు మద్యం తయారీ సంస్థలు, సరఫరా సంస్థలను కోర్టు ఆదేశించింది.