constable Mekala Eshwar Dismissed: హైదరాబాద్ లో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ గా పని చేసిన మేకల ఈశ్వర్ ని డిపార్ట్మెంట్ నుంచి బహిష్కరించారు అధికారులు. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన అనుభవంతో నేరస్తులతో సంబంధాలు పెంచుకుని వారిని తనకనుగుణంగా మలుచుకుని, తాను చెప్పినట్టు చేసేలా తయారు చేసుకున్నాడు ఈశ్వర్. హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోను తన దొంగల సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకున్నాడు. ఇలా ఏకంగా ఏడు దొంగల ముఠాలను ఏర్పాటు చేసుకుని,వారితో దొంగతనాలు చేయించడం, పట్టుబడితే బెయిల్ ఇప్పించడం,చోరీ చేసిన సొమ్మును దాచుకోవడం, తనకు సహకరించిన పై అధికారులకూ వాటాలు ఇవ్వడం లాంటివి చేసేవాడు. చోరీలు చేస్తున్న కుటుంబాలకు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలకు ఇచ్చేవాడని ఆరోపణలున్నాయి.
2022 నవంబర్ లో నల్గొండలో వరుసగా సెల్‌ఫోన్ దొంగతనాలు జరగడం కలకలం రేపింది. దీంతో అక్కడి పోలీసు అధికారులు దీనిపై దృష్టిసారించారు. సీసీటీవీ ఫుటేజీల సాయంతో అనుమానితులను అదుపులోకి తీసుకున్న తరవాత విచారణలో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఈశ్వర్ పేరు వెల్లడైంది. అతనే ఇవన్నీ చేయిస్తున్నాడని తేలింది. ఈశ్వర్‌ని మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని, పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వివరాలు సేకరించారు. విచారణలో మొదట నేరం చేశానని అంగీకరించకపోయినా, పోలీసులు తమదైన శైలిలో టెక్నికల్ సాక్ష్యాలు, కాల్ డేటా ఆధారంగా, అలాగే దొంగతనాలు చేయించిన వ్యక్తులను సైతం చూపించి విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు.
2010 బ్యాచ్‌కు చెందిన ఈశ్వర్ మొదటి నుంచి వివాదాల్లో నిలిచేవాడు. ఎక్కడ ఉద్యోగం చేసినా అక్కడ ఏదో విధంగా తన బుద్ధి చూపించి మోసాలకు పాల్పడేవాడు. ఈశ్వర్ టాస్క్‌ఫోర్స్‌లోకి రావడానికి ముందు ఎస్సార్‌నగర్, బేగంపేట సహా వివిధ పోలీసుస్టేషన్లలో పని చేశాడు. ఒక్కో దొంగ కి నెలకు 50వేల వరకు డబ్బు ఇచ్చి పోషించేవాదంటే ఏ రేంజ్ లో దొంగతనాలు, అక్రమాలకు పాల్పడేవాడో అర్థం చేసుకోవచ్చు. అక్కడ వారికి అద్దె ఇంటిలో ఆవాసం కల్పించేవాడు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం నాలుగు స్నాచింగ్స్ చేయాలని టార్గెట్ పెట్టేవాడు. దేవాలయాలు, పబ్లిక్ మీటింగ్స్ జరిగే ప్రాంతాలనే ఎక్కువగా టార్గెట్ చేయించే ఈశ్వర్ సెల్‌ఫోన్లతో పాటు బంగారు నగలను స్నాచింగ్ చేయించే వాడు.
చోరులకు సంబంధించిన వారి నుంచి సొత్తు కొనే రిసీవర్లను గుర్తించి, బెదిరింపు వసూళ్లకు పాల్పడేవాడు. వీటి ద్వారానే కొత్త దొంగల వివరాలు తెలుసుకుని వారి తనకు అనుకూలంగా మలుచుకుని పలు అక్రమాలకు పాల్పడిన ఈశ్వర్ రూ.20 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు.
మేకల ఈశ్వర్ కేసు విచారణలో మరికొంతమంది ఇన్‌స్పెక్టర్లు కూడా నేరాల్లో పాల్గొనట్టు అధికారులు గుర్తించారు. గతంలో షాహినాయత్ గంజ్ పీఎస్ లో ఇన్‌స్పెక్టర్ గా పని చేసిన వై. అజయ్ కుమార్, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ గా పని చేసిన టి. శ్రీనాథ్ రెడ్డి, ఎస్సార్ నగర్‌లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా చేసిన సాయి వెంకట్ కిషోర్ లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 25/12/2021 నుండి 20/12/2022 వరకు, 59 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పై శిక్షలు విధించినట్టు హైదరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.