కరోనా వైరస్ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది చైనా పేరే. ఎందుకంటే.. ఆ వైరస్ మొదలైంది అక్కడి నుంచే. ఆ తర్వాత అది ప్రపంచమంతా విస్తరించి.. ఎంత విషాదం నింపిందో తెలిసిందే. కేవలం వ్యాధి వల్లే కాదు.. దాని ప్రభావం వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎకనామి కుదేలైంది. ఫలితంగా ఆకలి చావులు కూడా నమోదవుతున్నాయి. వైరస్ ప్రభావం తగ్గినా.. ఆ వ్యాధి మిగిల్చిన దారుణ ఫలితాల ప్రభావం మరో ఐదేళ్ల వరకు కొనసాగించవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే.. చైనాలో ఇప్పుడు ‘మౌత్ బడ్డీస్’ పేరుతో అపరిచితుల మూతులపై ముద్దులు పెట్టే ట్రెండ్ మొదలైంది. ఈ విషయం తెలిసి ఇప్పుడు జనాలు మళ్లీ తలలు పట్టుకుంటున్నారు. ‘‘అరే.. మళ్లీ ఏం ప్లాన్ చేశార్రా...’’ అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఈ ట్రెండ్‌ను ఎందుకు మొదలుపెట్టారో తెలుసా?
మాస్కులు వదిలేసి ముద్దులు
ఈ మాయదారి ముద్దుల ట్రెండ్‌ను మాండరిన్‌లో ‘zui you’ (జుయి యు) అని అంటారు. అంటే.. ‘మౌత్ బడ్డీస్’ (Mouth buddies) అని అర్థం. ‘మౌత్ బడ్డీస్’ నియమాల ప్రకారం.. కేవలం పెదాలపైనే ముద్దు పెట్టాలి. అయితే, వారితో డేటింగ్ చేయకూడదు. రెండోసారి కూడా వారికి ముద్దు పెట్టకూడదు. కేవలం ఒక్కసారే.. కొత్త వ్యక్తులను మాత్రమే ముద్దాడాలి. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అపరిచితులను ముద్దుపెట్టుకోండి అంటూ పలువురు ‘మౌత్ బడ్డీస్’ను ప్రోత్సహిస్తున్నారు. తెలియని వ్యక్తులను ముద్దు పెట్టుకుంటే అదో కిక్ అని అంటున్నారు. ఇన్నాళ్లూ మాస్కులతో మూసివున్న నోళ్లతో అపరిచితులను పలకరిద్దాం రండి అంటూ ముద్దులు పెట్టేస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలనే తేడా లేకుండా ఎవరికి పడితే వారికి ముద్దులెట్టేసుకుంటున్నారు.
ఎందుకు ఈ ట్రెండ్?
అయితే, ఈ డేటింగ్ ట్రెండ్‌ను ఎవరు? ఎందుకు? ఎప్పుడు ప్రారంభించారనేది మాత్రం తెలియరాలేదు. అయితే, దీన్నిపై భిన్న వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ఇష్టమైనవారికి తప్పా.. తమ పేదాలను అందించరాదని, ఈ ట్రెండ్ కేవలం ఆరోగ్యానికే కాదు.. మనసుకు కూడా మంచిది కాదని అంటున్నారు. ముద్దు అనేది ఒక మంచి ఫీల్ అని అది అపరిచితులకు ఇస్తే రాదని కొంతమంది వాదిస్తున్నారు. ఒక పక్క కరోనా వైరస్ వ్యాపిస్తుంటే.. ఇలా తెలియని వ్యక్తులను ముద్దు పెట్టుకొనే ట్రెండ్ ఏమిటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఏకంగా వైద్య అధికారులకే నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఇంటర్నెట్ ద్వారా కరోనా కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల యువతకు కూడా చేరితే.. పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పోయేకాలం వస్తే ఇంతేనంటూ జనాలు ఈ ట్రెండ్‌ను తిట్టిపోస్తున్నారు. కరోనాతో అంతమందిని బలి తీసుకున్నా చైనావాళ్లకు బుద్ధి రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: ‘కాంతార’లోని దొరగారి ఇంట్లో మీరూ ఉండొచ్చు - ఇంత చెల్లిస్తే చాలు!