ఆలుగడ్డ చాలా మందికి ఇష్టమైన దుంప కూర. వేపుడు చేసినా, కుర్మా చేసినా, కూర చేసినా అవీ ఇవీ ఏవీ కాదు కరకరలాడే చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, లేదా టిక్కి, పదార్థం ఏదైనా సరే అందరికీ నచ్చేదే. అయితే ఇష్టమైన ఆలుగడ్డ తినడానికి ఎప్పుడూ భయమే. అయితే, బంగాళ దుంపను చూసి భయపడొద్దని, అది మీకు సంజీవనిలా పనిచేస్తుందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది.
బ్రిటన్ కు చెందిన పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ చేసిన కొత్త అధ్యయనంలో బంగాళాదుంపల్లో ముఖ్యమైన పోషకాలు చాలా ఉంటాయని తేలింది. ఇప్పటి వరకు అందరూ నమ్ముతున్న దానికి భిన్నమైన విషయాలు తెలియజేశాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు కాండిడా రెబెల్లో మాట్లాడుతూ.. బంగాళా దుంపలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై పెద్దగా ప్రభావం చూపవన్నారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు బంగాళా దుంపలు తిని బరువు కూడా తగ్గారట. ఏ రకమైన పదార్థాలు తయారు చేస్తారు? తయారీ తీరు ఏమిటి? వంటి అనేక విషయాల మీద ఆలుగడ్డల వల్ల అనారోగ్యం కలుగుతుందా ఆరోగ్యానికి మేలు చేస్తాయా అనేది ఆధార పడి ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు అంటున్నారు. వీళ్లు చెప్పిన దాన్ని బట్టి ఉడక బెట్టిన ఆలుగడ్డల వల్ల షుగర్ పెరగదట.
బంగాళాదుంపల్లోని గ్లైకోఅల్కలాయిడ్స్ అనే బయోయాక్టివ్ కాంపౌండ్స్ క్యాన్సర్ చికిత్సకు కూడా దోహదం చేస్తాయని పోలాండ్ పోజ్నాన్ లోని ఆడమ్ మిక్కీవిచ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళా దుంపల్లో పోషకాల విషయానికి వస్తే దాని పైచర్మంలో ఇవి పుష్కలంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. విటమిన్ సి చక్కని యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాల రూపంలో బంగాళాదుంపల్లో ఉంటాయి. బంగాళాదుంపలు యాంటీ ఆక్సీడెంట్లతో పుష్కలం అని అర్థం చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్ చర్చను నిరోధిస్తాయి. ఆహారం, ఒత్తిడి, ధూమపానం, మద్యం, వ్యాయామం, వాడుతున్న మందులు, వాతావరణంలోని కాలుష్యం వంటి ఎన్నో విషయాలు శరీరంలో ఫ్రీరాడికల్ చర్యలకు కారకాలుగా ఉంటాయి. శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరిగిపోతే క్యాన్సర్ మాత్రమే కాదు గుండెజబ్బులకు కూడా కారణం కావచ్చు.
గట్ ఫీలింగ్
జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. బంగాళదుంపలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తాయి. బంగాళదుంపల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణక్రియలో జీర్ణం కాదు. నేరుగా పెద్ద పేగులకు చేరుతుంది. మంచి బాక్టీరియా పోషణకు తోడ్పడుతుంది. అంతేకాదు బ్యూటిరేట్ వంటి షార్ట్ చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఈ బ్యూటిరేట్ ఉత్పత్తి చేస్తుంది. పెద్ద పేగు కణాలకు ఇది చక్కని ఎనర్జీ సోర్స్. రెసిస్టెంట్ స్టార్చ్ శాతం పెరగాలంటే ఆలుగడ్డలను సలాడ్ లా తయారు చేసి, దాన్ని ఫ్రీజ్ లో నిల్వ చెయ్యాలి. చల్లబడిన ఆలుగడ్డల్లో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది.
బరువు తగ్గొచ్చట
ఆలుగడ్డలు ఆకలి తీరుస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తాయి. అయితే బరువు తగ్గాలంటే మాత్రం తప్పకుండా ఉడికించి లేదా కాల్చి తీసుకోవాలి తప్ప వేయించి తినకూడదు. ఇలా తయారు చేసిన వాటిలో కేలరీలు కూడా తక్కువ. అంతే కాదు ఫ్యాట్ ప్రీ కూడా.
అయితే వేయించిన బంగాళదుంపలు, చిప్స్ కి ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే వాటిని సాధారణంగా చాలా నూనెలో వేయిస్తారు. వీటిలో కొవ్వులు , కేలరీలు కూడా ఎక్కువే. బరువు తగ్గాలనుకుంటే ఉడికించిన లేదా కాల్చిన పొటాటో బెస్ట్ ఆప్షన్.
ఒక పెద్ద సైజు అరటిపండులో కంటే కూడా ఆలుగడ్డలో 40 శాతం ఎక్కువ పొటాషియం ఉంటుంది. పొటాషియం ఒక ఎలక్ట్రోలైట్ నాడులు, కండరాల పనితీరుకు అత్యవసరం. బీపిని అదుపు చేస్తుంది కూడా. రాత్రి పూట నిద్రకు కూడా ఈపోషకం అవసరం. కాబట్టి డిన్నర్ లో ఉడికించిన చిన్నచిన్న ఆలుగడ్డలు లేదా మీడియం సైజు కాల్చిన ఆలుగడ్డలు మంచి ఆప్షన్.
కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఈ దుంపలు ఎక్కువ గా తింటే బరువు పెరిగే ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. కానీ సమతుల ఆహారంలో భాగంగా కార్బోహైడ్రేడ్ రిసోర్స్ గా బంగాళా దుంపను అనుమానం లేకుండా తీసుకోవచ్చు. మోతాదు మించకుండా జాగ్రత్త పడాలి తప్పుకుండా.
ఎలా తీసుకోవాలి?
ఎక్కువ కాలం నిల్వ ఉండగలిగే ఈ దుంప కూరగాయ మంచి పాకెట్ ప్రెండ్లీ. పొడిగా, చీకటిగా ఉండే చోట పెట్టుకుంటే చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ప్లాస్టిక్ కంటే పేపర్ బ్యాగ్ లో నిల్వ చెయ్యడం మంచిది. ఉడికించి, కాల్చి, స్టీమ్ చేసి తొక్కతో పాటు తినగలిగితే మాత్రమే ఆలుగడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం బాగా గుర్తుంచుకోవాలి.
Also Read: బాగా అలసటగా ఉంటోందా? ఇందుకు కారణాలివే!