తగినంత నిద్రలేకపోతే దాని ప్రభావం రోజంతా కనిపిస్తుంది. కానీ కంటి నిండా నిద్ర, పొట్ట నిండుగా ఆహారం ఉన్నా కానీ నీరసంగా అనిపిస్తుందా? అలసటగా ఉండి ఏ పని చేయలేకపోతున్నారా? అయితే ఇది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే శరీరంలోని అనేక లోపాల కారణంగా అలసట వస్తుంది. అది తెలుసుకుని సమస్యని సత్వరమే పరిష్కరించుకోకపోతే మాత్రం తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎనర్జీ తెచ్చుకోవడానికి మీరు ఇబ్బంది పడుతుంటే ఇవి లోపించాయని అర్థం.
విటమిన్ బి 12 అవసరం
మైటోకాండ్రియా కణాల పవర్ హౌస్. శక్తిని ఉత్పత్తి చెయ్యడానికి విటమిన్ బి మీద ఆధారపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి12 చాలా అవసరం. ఇది లోపిస్తే శరీరం నీరసంగా అనిపిస్తుంది. త్వరగా అలిసిపోతారు. శాఖాహారుల్లో ఇటువంటి ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తుంది. మాంసం, చేపలు, గుడ్లులో విటమిన్ బి12 అధికంగా దొరుకుతుంది. మాంసం, జంతు ఉత్పత్తులు నివారించే వాళ్ళు బి12 ని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండ తగలక పోవడం
శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. సూర్యరశ్మి తగలకపోవడం వల్ల విటమిన్ డి తక్కువగా ఉంటుంది. శరీరానికి శక్తి కావాలంటే ఈ విటమిన్ శరీరానికి ఖచ్చితంగా కావాలి. శీతాకాలంలో సూర్యకాంతి సరిగా ఉండదు కాబట్టి అక్టోబర్ నుంచి మార్చి మధ్య కనీసం 10 ug రోజువారీ విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు గుడ్డు, పుట్టగొడుగులు, సాల్మన్ చేపలు, తృణధాన్యాలు, బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి.
బ్లడ్ షుగర్ చెక్ చెయ్యాలి
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల శక్తి తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఆందోళనకి దారితీస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సక్రమంగా ఉంటేనే కణాలకి శక్తినిస్తుంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకుంటూనే రక్తంలో చక్కెర స్థాయిలు గమనించుకోవాలి. ప్రోటీన్, కార్బో హైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. బ్రౌన్ రైస్, ఓట్స్, బుక్వీట్, క్వినోవా, చిలగడదుంప వంటి పిండి పదార్థాలు భోజనంలో ఉండేలా చూసుకోవాలి.
బరువు పెరగడం
ఆశ్చర్యం కలిగించినా కూడా బరువు పెరగడం వల్ల కూడా అలసటగా అనిపిస్తుంది. ఎందుకంటే శరీరం శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు తక్కువగా తీసుకోవాలి. పోషకాలు అందించే ఆహారాలు తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.
టైమ్ కి తినకపోవడం
సరైన సమయానికి తినడం వల్ల జీర్ణక్రియ, బ్లడ్ షుగర్ లెవల్స్ సక్రమంగా ఉండి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. టైమ్ కి తినకపోతే గుండెల్లో మంట, అజీర్ణం ఉబ్బరం వంటి కొన్ని జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. వాటితో పాటు శరీరానికి ఎనర్జీ అందదు. అధిక చక్కెర ఉండే ఆహార పదార్థాలు నివారించడం ఉత్తమం.
గట్ హెల్త్ సరిగా లేదు
ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో గట్ లోని మంచి బ్యాక్టీరియా తోడ్పడుతుంది. సౌర్‌క్రాట్, కిమ్చి, పెరుగు, కేఫీర్ వంటి సాంప్రదాయకంగా పులియబెట్టిన ఆహారాలను తినడం, మల్టీ స్ట్రెయిన్ లైవ్ బాక్టీరియా సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అది శరీరానికి సహకరిస్తుంది.
చురుకుగా లేకపోవడం
శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల శక్తి పెరిగి అలసట తగ్గుతుంది. వ్యాయామం చేయడం, మెట్లు ఎక్కడం, నడక వంటి చిన్న చిన్న పనులు శరీరాన్ని అలసట నుంచి దూరం చేస్తాయి. అంటే మనం ఎంత ఎక్కువ శక్తి ఉపయోగిస్తే మనం అంత యాక్టివ్ గా ఉండగలుగుతాం.
నిద్ర తగ్గడం
శరీరానికి తగినంత నిద్ర అవసరం. సిర్కాడియన్ రిథం సరిగా ఉండాలి. ఇది మన నిద్ర చక్రాన్ని సూచిస్తుంది. వేళకి పడుకోవడం, సరైన సమయానికి నిద్ర లేవడం కూడా ముఖ్యమే.
మెగ్నీషియం లోపం
శరీరంలో నాడీ వ్యవస్థ, శక్తి ఉత్పత్తికి మద్దతు ఇవ్వడానికి మెగ్నీషియం కీలకం. దాని లోపం కారణంగా అలసటగా ఉంటుంది. ఆహార పదార్థాల ద్వారా ఈ లోపాన్ని భర్తీ చేసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: విటమిన్-D వల్ల బరువు తగ్గుతారా? ఇది లోపిస్తే వచ్చే సమస్యలేంటో తెలుసా?