శరీరంలో అత్యంత ముఖ్యమైన, ప్రధాన పోషకాల్లో ఒకటి విటమిన్ డి. శీతాకాలంలో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా విటమిన్-డి అవసరం. చాలా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఇన్ఫెక్షన్స్ లేని బలమైన శరీరాన్ని, ధృడమైన ఎముకలని అందిస్తుంది. విటమిన్ డి సప్లిమెంట్లు బాడీ మాస ఇండెక్స్ ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్-D శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడమే కాకుండా బరువు తగ్గించడంలోను సహాయపడుతుంది.
మయో క్లినిక్ ప్రకారం విటమిన్ డి శరీరంలో కొత్తగా కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. కొవ్వు కణాల నిల్వను అణచివేస్తుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని సమర్థమవంతంగా అడ్డుకుంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు, నాజూకుగా ఉంటారు. శరీరంలోని సెరోటోనిన్, టెస్టోస్టెరాన్ స్థాయిలు జీవక్రియని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి శరీరంలోని కేలరీలని కరిగిస్తాయి. ఆకలిని నియంత్రిస్తాయి. జీర్ణక్రియను పెంచుతుంది, శరీర కొవ్వును తగ్గిస్తుంది. శరీరంలో విటమిన్ డి అధిక మొత్తంలో ఈ రెండు హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. ఇవి శరీరంలోని ప్రతిదానిని ప్రభావితం చేస్తాయి. మానసిక స్థితి దగ్గర నుంచి నిద్ర వరకు వీటి మీద ఆధారపడతాయి.
ఊబకాయం ఉన్నవారిలో విటమిన్ డి తక్కువ
హార్వర్డ్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం స్థూలకాయులు తీసుకునే ఆహారంలో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. దాని వల్ల శరీరానికి అవసరమైన కొన్ని ఎంజైమ్ లని కోల్పోతారు. క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం విటమిన్ డి వల్ల బరువు తగ్గుతారు. రక్తంలో విటమిన్ డి పెరగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోయింది అనేది నిరూపితమైనదని పరిశోధకులు చెబుతున్నారు.
విటమిన్ డి లోపం లక్షణాలు
☀ అలసట
☀ నిద్రలేమి
☀ ఎముకల నొప్పులు
☀ డిప్రెషన్, ఒత్తిడి
☀ జుట్టు రాలిపోవడం
☀ కండరాల బలహీనత
☀ శరీరం నొప్పులు
విటమిన్ డి స్థాయులని పెంచుకోవడం ఎలా?
ఎండలో కాసేపు ఉండాలి: శరీరంలో విటమిన్ డి స్థాయిలని పెంచుకోవడానికి ప్రధాన మార్గం సూర్యరశ్మి. ఎండ ద్వారా శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుంది. చర్మం కింద పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ని ఇది కరిగించేందుకు సహాయపడుతుంది. సూర్యుడి నుంచి వచ్చే UV-B రేడియేషన్ సమ్మేళనాలు విటమిన్ డి గా మారతాయి. ఉదయం వేళ శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎండ కూడా శరీరానికి మంచిది.
కొవ్వు చేపలు తినాలి: సూర్యరశ్మి ద్వారానే కాకుండా సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలి. ట్యూనా, మాకేరెల్, సార్దినెస్ వంటి కొవ్వు చేపలు, రొయ్యలు, గుల్లలు వంటి షెల్ఫిష్ లు విటమిన్ డి లభించే అత్యంత సంపన్నమైన సహజ వనరులు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ఈ ఆహారాల్లో చాలా వరకు గుండె కి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లకి పవర్ హౌస్ లాంటివి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా శరీరాన్ని కాపాడుతుంది.
బలవర్ధకమైన ఆహారాలు తినాలి: పాలు, నారింజ, తృణధాన్యాలు, పెరుగు వంటి బలవర్ధకమైన ఆహారాలు తీసుకోవాలి. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్డు సోనాలు విటమిన్ డి తో నిండి ఉంటాయి. తెల్ల సొన మాత్రమే కాకుండా పసుపుది కూడా తీసుకోవాలి. తక్కువ కేలరీలు కలిగిన తృణధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: తేలికపాటి జ్వరమేనని తేలిగ్గా తీసుకోవద్దు, అది చాలా డేంజర్