Covid Cases In China:


భారీగా నమోదవుతున్న కేసులు..


చైనాలో మరోసారి కరోనా సంక్షోభం మొదలైంది. ఈ మధ్యే కఠిన ఆంక్షల్ని సడలించింది ప్రభుత్వం. అప్పటి నుంచి భారీ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ లెక్కలు దాచి పెట్టిన చైనా...ఇప్పుడు అధికారికంగా కేసులు పెరుగుదలపై ప్రకటన చేసింది. ఆరోగ్య విభాగానికి చెందిన అధికారులు...దేశంలో మరో మూడు కరోనా వేవ్‌లు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. అందులో ఇప్పటికే ఓ వేవ్ మొదలైందని చెబుతున్నారు. జనవరి ముగిసే వరకూ...భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆదివారం దాదాపు 3 వేల కేసులు నమోదయ్యాయని బయటకు చెబుతున్నా...నిజానికి ఆ సంఖ్య అంతకు మించి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ వేవ్ మొదలైందని...జనవరి ముగిసే నాటికి రెండో వేవ్‌ వచ్చే ప్రమాదముందని అంటున్నారు. కొత్త ఏడాది వేడుకలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం వల్ల కొవిడ్‌ కేసులు అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయి. ఫలితంగా...ఫిబ్రవరి, మార్చి వరకూ ఈ ప్రభావం కొనసాగుతుండొచ్చు. అయితే...వ్యాక్సినేషన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తుండటం వల్ల  ప్రాణ నష్టం తక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు. చైనాలో...90% మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అయితే...80 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చినప్పటికీ...రోగనిరోధక శక్తి వారిలో తక్కువగా ఉంటుందని...వీరి ద్వారానే వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని చైనా ఆందోళన చెందుతోంది. 


3 లక్షల మరణాలు..? 


ఆంక్షల్ని ఎత్తివేయడం వల్ల చైనాలో భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యే ప్రమాదముందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో అనూహ్య స్థాయిలో కేసులు  నమోదవడమే కాకుండా...లక్షలాది మరణాలు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. 2023 ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనా వ్యాప్తంగా కొవిడ్ కేసులు తారస్థాయికి చేరుకుంటాయని, మరణాల సంఖ్య 3 లక్షల 22 వేల వరకూ నమోదవుతుందని అంచనా వేసింది. అప్పటికి ఆ దేశ జనాభాలో మూడోవంతు ప్రజలకు కొవిడ్ సోకుతుందని తెలిపింది. నిజానికి...చైనాలో ఇప్పటికే కొవిడ్ మరణాలు పెరిగాయని.. కానీ ప్రభుత్వం  ఆ లెక్కల్ని బయటపెట్టడం లేదనిఆరోపణలున్నాయి. చివరి సారి డిసెంబర్ 3వ తేదీన మరణాల సంఖ్యను వెల్లడించింది చైనా. అప్పటి నుంచి మరే వివరాలూ అందలేదు. ఈ నెల మొదట్లోనే ఆంక్షల్ని సడలించింది ప్రభుత్వం. అప్పటి నుంచి కొవిడ్ వ్యాప్తి పెరుగుతోంది.  వచ్చే నెల నాటికి దేశ జనాభా అంతటికీ వైరస్ సోకుతుందని ఆందోళన చెందుతున్నారు. అమెరికాకు చెందిన IHME..జీరోకొవిడ్ పాలసీ వల్లే చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా  సోకకుండా అడ్డుకోగలిగారని తేల్చి చెప్పింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చేసిన ప్రకటన ఆధారంగా చూస్తే...PCR టెస్టింగ్ విషయంలో ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలకు కాస్త మినహాయింపులు ఇవ్వనున్నారు. లాక్‌డౌన్‌ లను కూడా క్రమంగా తొలగించనున్నారు. సివియర్ సింప్టమ్స్ లేని బాధితులు ఇంట్లోనే ఐసోలేట్ అయ్యేందుకు అవకాశం కల్పించ నున్నారు. పబ్లిక్ బిల్డింగ్స్‌లోకి వెళ్లాలంటే ఇప్పటి వరకూ చైనా పౌరులు తమ ఫోన్‌లో గ్రీన్ కోడ్‌ను అధికారులకు చూపించాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


Also Read: Bilawal Bhutto Row: మోదీకి భయపడేది లేదు- ఏం కావాలన్నా చేసుకోండి: పాక్ విదేశాంగ మంత్రి