RCB's radar: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.... ప్రతిసారి యే సాలా కప్ నమదే అనే నినాదంతో ఐపీఎల్ ఆడుతుంది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోలేదు. స్టార్ బ్యాటర్స్, హేమాహేమీల్లాంటి బౌలర్లు ఉన్నప్పటికీ ఏ సీజన్ లోనూ తన స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో బెంగళూరు కొత్త కెప్టెన్, ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకుంది. క్వాలిఫయర్- 2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఈసారి మరింత గట్టిగా ఆడి కప్ ను ఒడిసి పట్టాలనుకుంటోంది. దానికి తగ్గట్లు ఈనెల 23న జరిగే మినీ వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యింది.
ఎవరిని రిలీజ్ చేసింది
రాయల్ ఛాలెంజర్స్ జట్టు కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే ఈసారి విడుదల చేసింది. ఈ సీజన్ లో అతి తక్కువ ఆటగాళ్లను వదిలేసిన జట్లలో బెంగళూరు ముందుంది. అలాగే పర్సు కూడా ఆ జట్టుకు చాలా తక్కువే ఉంది. కేవలం 8.75 కోట్ల మనీ మాత్రమే బెంగళూరు ఖర్చు చేసే వీలుంది. ఈ డబ్బుతోనే
మరో ఏడుగురు ఆటగాళ్లను దక్కించుకోవాలి. అందులో రెండు ఓవర్సీస్ స్లాట్లు.
ఆ జట్టుకు ఎవరు కావాలి
బెంగళూరు జట్టు జాసన్ బెహ్రెన్ డార్ఫ్ ను ముంబయి ఇండియన్స్ కు ట్రేడ్ చేసింది. కాబట్టి ఇప్పుడు జోష్ హేజిల్ వుడ్ కు బ్యాకప్ గా మరో విదేశీ సీమర్ కోసం చూస్తోంది. అలాగే టాపార్డర్ బ్యాటర్ ను కొనుగోలు చేయాలనుకుంటోంది. ఫాఫ్ డుప్లెసిస్ కు తోడుగా ఓపెనింగ్ చేయగలిగిన వారిని వేలంలో దక్కించుకోవాలనుకుంటోంది. అలా అయితే విరాట్ కోహ్లీ తనకు అనుకూలమైన వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగవచ్చు. అలాగే ఇద్దరు భారత ఫాస్ట్ బౌలర్లను కొనాలనే యోచనలో ఉంది. మహమ్మద్ సిరాజ్ గత సీజన్ లో అంతగా రాణించలేదు. సిద్ధార్థ్ కౌల్ కూడా వారికి ఉన్నాడు. వారిద్దరికీ తోడుగా మరో ఇద్దరిని కొనాలనుకుంటోంది. అలాగే వానిందు హసరంగకు తోడుగా మరో భారత స్పిన్నర్ ను ఎంచుకోవాలని చూస్తోంది.
వారిపై కన్ను
నాథన్ కౌల్టర్ నైల్, జై రిచర్డ్ సన్, ఆడమ్ మిల్నే, రీస్ టాప్లీలు బ్యాకప్ ఓవర్సీస్ సీమర్స్ స్లాట్ ల కోసం బెంగళూరు ఎంపికలో మొదట ఉన్నారు. అలాగే ఓపెనింగ్ స్థానం కోసం మయాంక్ అగర్వాల్ ను కొనాలని చూస్తోంది. అయితే బెంగళూరు పర్స్ అందుకు సరిపోతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గతేడాది వేలంలో మయాంక్ రూ. 12 కోట్లు పలికాడు. ఈసారి కూడా అతనికి మంచి డిమాండ్ ఉంది. అధిక పర్స్ వాల్యూ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ (రూ. 42.25 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ. 32.20 కోట్లు) మయాంక్ కోసం పోటీ పడొచ్చు. ఒకవేళ మయాంక్ కనుక రాకపోతే భారత దేశవాళీ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ ను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటోంది. అతను ఓపెనింగ్ తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయగలడు.
రాయల్ ఛాలెంజర్స్ ప్రస్తుత జట్టు
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఫిన్ అలెన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్