IPL Auction 2023:  దీపక్ చాహర్... ఇప్పుడిప్పుడే టీమిండియాలో ఎదుగుతున్న ఫాస్ట్ బౌలర్. జాతీయ జట్టులో అవకాశం వచ్చినప్పుడల్లా సత్తా చాటుతున్న యువ బౌలర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో భారత్ కు ఉపయోగపడే ఆటగాడు. ఇప్పటివరకు 24 టీ20లు ఆడిన చాహర్ 8.17 ఎకానమీతో 29 వికెట్లు తీశాడు. అలాగే దీపక్ చాహర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా కీలక బౌలర్. పవర్ ప్లే ఓవర్లలో రెగ్యులర్ గా వికెట్లు తీస్తూ చెన్నైకు శుభారంభాలు అందిస్తాడు. ఇప్పటిదాకా చెన్నై తరఫున 63 మ్యాచులు ఆడిన దీపక్ 7.8 ఎకానమీతో 59 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ లోయరార్డర్ లోనూ విలువైన పరుగులు చేస్తూ జట్టుకు ఉపయోగపడగలడు. 

తరచుగా గాయాలు

అయితే తరచుగా గాయాల బారిన పడడం దీపక్ చాహర్ కు ఉన్న మైనస్ పాయింట్. ఇటీవల చాహర్  చాలా తరచుగా గాయాలతో బాధపడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ కోసం స్టాండ్ బైగా ఎంపికైనప్పటికీ.. వెన్ను, తుంటి గాయంలో ఆస్ట్రేలియా వెళ్లలేకపోయాడు. అలాగే బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లోనూ గాయంతో దూరమయ్యాడు. 2022 ఐపీఎల్ వేలంలో చెన్నై ఫ్రాంచైజీ చాహర్ ను రూ. 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే వెన్ను గాయంతో టోర్నమెంట్ మొత్తానికి అతను దూరమయ్యాడు. ఈ క్రమంలో 2023 ఐపీఎల్ లో దీపక్ చాహర్ కు ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై చెన్నై యాజమాన్యం దృష్టి పెట్టినట్లు సమాచారం. 

డిసెంబర్ 23న కొచ్చిలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఆ వేలంలో సీఎస్కే ముగ్గురు కీలక బౌలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని జట్టులోకి తీసుకుని చాహర్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. ఇంతకీ వారెవరంటే

1.  సందీప్ వారియర్..... భారత దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్ ఇతను. ఇప్పటివరకు 69 లిస్ట్ ఏ మ్యాచుల్లో 5.38 ఎకానమీతో 83 వికెట్లు తీశాడు. 31 ఏళ్ల సందీప్ పొట్టి ఫార్మాట్ లోనూ రాణిస్తున్నాడు. ఇందులో 68 మ్యాచుల్లో 7.20 ఎకానమీతో 62 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను గొప్ప ఫాంలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున ఆడి 7 మ్యాచుల్లో 10 వికెట్లు తీసుకున్నాడు. రైట్ ఆర్మ్ పేసర్ అయిన సందీప్, చాహర్ లానే పవర్ ప్లే, డెత్ ఓవర్లలో ప్రభావం చూపగలడు. కాబట్టి సీఎస్కే ఈ వేలంలో ఇతనిపై ఆసక్తి చూపిస్తోంది. 

2. గెరాల్డ్ కొయెట్జీ.....  దక్షిణాఫ్రికాకు చెందిన గెరాల్డ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. గంటకు 140 కిమీల వేగంతో బౌలింగ్ చేయగలడు. సౌతాఫ్రికా దేశవాళీ టోర్నీల్లో విశేషంగా రాణించాడు. తన వేగం, పేస్ తో బ్యాటర్లకు సవాల్ విసరగలడు. 29 టీ20 మ్యాచుల్లో 7.76 ఎకానమీతో 37 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లోనూ 140కి పైగా స్ట్రైక్ రేట్ తో 152 పరుగులు సాధించాడు. అలాగే సీఎస్ ఏ టీ20 లీగ్ లో 8 మ్యాచుల్లో 7.67 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. 207.31 స్ట్రైక్ రేట్ తో 85 పరుగులు చేశాడు. ఈ గణాంకాల వలనే సీఎస్కే ఇతనిపై ఆసక్తి చూపిస్తోంది. ఇతన్ని వేలంలో కొని తన బౌలింగ్, బ్యాటింగ్ బలాన్ని పెంచుకోవాలనుకుంటోంది. 

3. తస్కిన్ అహ్మద్..... బంగ్లాదేశ్ తరఫున ఈ ఆటగాడు ఎంత బాగా రాణించాడో అందరికీ తెలుసు. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో విశేషంగా ఆకట్టుకున్నాడు. 5 మ్యాచుల్లో 7.27 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. ఇందులో నెదర్లాండ్స్ పై 4 వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ఇప్పటివరకు 46 టీ20ల్లో 7.79 ఎకానమీతో 36 వికెట్లు పడగొట్టాడు. 27 ఏళ్ల తస్కిన్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అందువల్ల రాబోయే వేలంలో చెన్నై ఇతడిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. 

చెన్నై వేలంలో వీరిని దక్కించుకుంటే.. ఒకవేళ దీపక్ చాహర్ అందుబాటులో లేకపోయినా వీరితో అతడిని భర్తీ చేయవచ్చు.