IND vs BAN, 1st Test:  బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదో రోజు 50 నిమిషాల్లోనే 4 ప్రత్యర్ధి వికెట్లు తీసిన భారత్ 188 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో 2 మ్యాచులో సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 


6 వికెట్లకు 272 పరుగులతో చివరి రోజు ఆట ప్రారంభించిన బంగ్లాకు మహ్మద్ సిరాజ్ మూడో ఓవర్లోనే షాకిచ్చాడు. మెహదీ హసన్ (13)ను ఔట్ చేశాడు. అయితే కెప్టెన్ షకీబ్ భారీ షాట్లు ఆడుతూ వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న షకీబ్ ను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. ఈ చైనామన్ బౌలర్ బౌలింగ్ లో 84 పరుగుల వద్ద షకీబ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. భారత బౌలర్లలో అక్షర్ 4, కుల్దీప్ 3 వికెట్లతో రాణించారు. సిరాజ్, ఉమేష్, అశ్విన్ లు తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.


మ్యాచ్ సాగిందిలా....


మొదటి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి రోజు బంగ్లా బౌలర్ల ధాటికి ఒక దశలో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడిన టీమిండియాను పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86) లు ఆదుకున్నారు. లోయరార్డర్ లో అశ్విన్ (58), కుల్దీప్ (40) కూడా రాణించటంతో మొదటి ఇన్నింగ్సులో భారత్ 404 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 3 వికెట్లతో టాపార్డర్ ను పడగొట్టగా.. కుల్దీప్ 5 వికెట్లతో లోయరార్డర్ పని పట్టాడు. దీంతో బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 


రెండో ఇన్నింగ్స్ లో గిల్, పుజారాలు శతకాలు బాదటంతో టీమిండియా 2 వికెట్లకు 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా ముందు 513 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బ్యాటర్లు బాగానే పోరాడారు. ఆ జట్టు ఓపెనర్లు శాంటో (67), జకీర్ హసన్ (100) లు మొదటి వికెట్ కు 124 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే మిడిలార్డర్ లో షకీబుల్ హసన్ (84) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమవటంతో బంగ్లా 188 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 


కల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.