IND vs BAN 1st Test:  చట్టోగ్రామ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ జరుగుతోంది. శనివారం నాలుగో రోజు బంగ్లా ఇన్నింగ్స్ జరుగుతుండగా రిషభ్ పంత్, విరాట్ కోహ్లీని కాపాడాాడు. అదేంటి కోహ్లీని పంత్ కాపాడ్డమేంటి అనుకుంటున్నారా.. వివరాలు తెలుసుకోండి మరి.  


భారత్- బంగ్లా తొలి టెస్ట్ నాలుగో రోజు బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్, నజ్ముల్ హోస్సేన్ శాంటోలు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి విసిగించారు. 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ జోడి మొదటి వికెట్ కు 124 పరుగులు జోడించి టీమిండియాను భయపెట్టింది. తొలి టెస్ట్ ఆడుతున్న జకీర్ సెంచరీ చేయగా.. శాంటో 67 పరుగులతో రాణించాడు. అయితే ఉమేష్ యాదవ్ 47వ ఓవర్లో శాంటోను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ వికెట్ వచ్చిన సమయంలో కొంత నాటకీయత జరిగింది. 


కోహ్లీ మిస్... పంత్ క్యాచ్


47వ ఓవర్లో ఉమేష్ యాదవ్ వికెట్లకు కొంచెం దూరంగా సంధించిన బంతిని శాంటో ఆడాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి స్లిప్ లో ఉన్న విరాట్ కోహ్లీ చేతుల్లో పడింది. ఫీల్డింగ్ లో, క్యాచ్ లు పట్టడంలో కోహ్లీ ఎంత చురుకుగా ఉంటాడో తెలిసిందే. అయితే అనుకోకుండా ఆ బంతి విరాట్ చేతుల్లో నుంచి మిస్ అయ్యింది. పక్కనే ఉన్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ వెంటనే స్పందించాడు. తన ఎడమ చేతి వైపుకు డైవ్ చేస్తూ ఆ బంతిని అందుకున్నాడు. పంత్ కూడా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి కింద పడుతుండగా రెండోసారి ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో కోహ్లీతో పాటు జట్టు సభ్యులందరూ ఊపరి పీల్చుకున్నారు. కెప్టెన్ రాహుల్ అయితే పంత్ కు నమస్కారం చేశాడు. దీన్ని బట్టి అర్ధమవుతుంది కదా ఆ క్యాచ్, ఆ వికెట్ ఎంత విలువైనదో. 


అవును మరి. అప్పటికే జకీర్ తో కలిసి తొలి వికెట్ కు సెంచరీకి పైగా భాగస్వామ్యం అందించిన శాంటోకు ఆ జీవనదానం లభించినట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో! ఆ వికెట్ తర్వాత టీమిండియా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత నాలుగో రోజు ప్రత్యర్థివి 5 వికెట్లు తీసిన భారత్ విజయం దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ఆఖరుకు బంగ్లా 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 241 పరుగులు కావాలి. 


కాబట్టి అర్ధమైంది కదా... కోహ్లీని పంత్ ఎలా కాపాడాడో.