INDW vs AUSW 4th T20:

  ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన నాలుగో టీ20లో భారత అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. శనివారం ముంబయిలోని బ్రబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ 7 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో 3-1 ఆధిక్యంలో నిలిచింది. 


తేలిపోయిన బౌలర్లు


మొదట టాస్ గెలిచిన భారత్, ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఆసీస్ ఓపెనర్లు వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడారు. మూనీ క్రీజులో ఇబ్బందిగా కదిలినప్పటికీ, హేలీ వేగంగా పరుగులు చేసింది. జట్టు స్కోరు 24 పరుగుల వద్ద మూనీ (3) ఔటయ్యింది. రెండో వికెట్ ను భారత బౌలర్లు త్వరగానే పడగొట్టారు. 6.5 ఓవర్లలో 46 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన గార్డెనర్ (27 బంతుల్లో 42), పెర్రీ (42 బంతుల్లో 72) లు విజృంభించి ఆడారు. వీరిద్దరూ భారీ షాట్లతో భారత బౌలర్లను చిత్తు చేశారు. తర్వాత గార్డెనర్ ఔటైనా.. హరిస్ తో కలిసి (12 బంతుల్లో 27) కలిసి పెర్రీ తన జట్టుకు 188 పరుగుల భారీ స్కోరును అందించింది. 






బ్యాటర్ల తడబాటు


189 పరుగుల భారీ విజయ లక్ష్యంతో ఇన్నింగ్సును ఆరంభించిన భారత్ కు శుభారంభం దక్కలేదు. స్మృతి మంధాన (10 బంతుల్లో 16) కొన్ని షాట్లు కొట్టినప్పటికీ త్వరగా ఔటయ్యింది. ఆ తర్వాత షెఫాలీ వర్మ (16 బంతుల్లో 20), జెమీమా రోడ్రిగ్స్ (11 బంతుల్లో 8) లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 46), దేవికా వైద్య (26 బంతుల్లో 32) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 72 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో హర్మన్, దేవికా వెనుదిరగటంతో లక్ష్యఛేదన కష్టమైంది. అయినప్పటికీ ఆఖర్లో రిచా ఘోష్ (19 బంతుల్లో 40), దీప్తి శర్మలు (8 బంతుల్లో 12) విజయం కోసం అద్భుతంగా పోరాడారు. అయితే అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో భారత్ విజయానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. 


ఆస్ట్రేలియా విజయంతో భారత్ సిరీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఇంక ఈ సిరీస్ లో నామమాత్రమైన ఐదో వన్డే మంగళవారం జరగనుంది.