బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌కు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ దొంగలు పడ్డ ఆరు నెలలకు, కుక్కలు మొరిగినట్టుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు... రెండేళ్ల కిందట బండి సంజయ్ చేసిన సవాల్ కు స్పందించకుండా... ఇప్పుడు నువ్వు ప్రతి సవాల్ విసిరితే ఏం లాభం కేటీఆర్? అని ప్రశ్నించారు.


డ్రగ్స్ తీసుకున్నందుకే అప్పుడు ఇవ్వలేదా...?
బండి సంజయ్ రెండేళ్ల కిందట డ్రగ్స్ ఆరోపణలు, సవాల్ చేసినప్పుడు... నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్?. అప్పుడు డ్రగ్స్ తీసుకున్నందుకే శాంపిల్స్ ఇవ్వలేదా...? అంటూ డీకే అరుణ మండిపడ్డారు. 
ఏ డ్రగ్ తీసుకున్నా ఆ (ఉత్ప్రేరకం) డ్రగ్ ఆనవాళ్లు, మనిషి శరీరంలో డ్రగ్ ని బట్టి, 24 గంటలు, కొన్ని డ్రగ్స్ లో ఆరు నెలల నుంచి 9 నెలలు మాత్రమే ఉంటాయన్నారు. కేటీఆర్ తీసుకున్నప్పుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. కానీ బీజేపీ నేత విసిరిన సవాల్ కు సమాధానం చెప్పలేక, విదేశాలకు వెళ్లి, డి అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తన శరీరంలో డ్రగ్ ఆనవాళ్లు ఏమి లేవని నిర్ధారించుకున్నాకే, కేటీఆర్ దొంగ సవాల్ విసురుతున్నారని ఎద్దేవా చేశారు.
నీకు దమ్ము, ధైర్యం ఉంటే..
కేటీఆర్ నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే బండి సంజయ్ చేసిన సవాల్ కు, అప్పుడే ఎందుకు స్పందించలేదు?. నిజంగా మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఆరోపణలు వచ్చినప్పుడే శాంపిల్స్ ఇచ్చి ఉంటే ప్రజలు కూడా నమ్మేవారని చెప్పారు. ఎందరు నేతలు విమర్శలు చేసినా.. అప్పుడే మీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ, లివర్ సహా నీ బాడీలో ఇంకా ఏమైనా పార్ట్స్ ఉంటే... అవి ఇవ్వకుండా ఇన్ని రోజులు ఎందుకు ఆగావో ప్రజలకు చెప్పాలన్నారు. పార్లమెంట్ సభ్యుడు, జాతీయ పార్టీకి చెందిన అధ్యక్షుడు అయిన బండి సంజయ్ పై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. 


ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు
సీఎం కొడుకువు, భవిష్యత్ సీఎం నువ్వే అని ప్రచారం చేయించుకుంటున్న కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేస్తే, ప్రజలే మిమ్మల్ని కొట్టే రోజులు వస్తాయన్నారు. కేటీఆర్ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులు, పిల్ల చేష్టలకు ఎవరూ భయపడరన్నారు. ప్రజా కోర్టులో బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్, కేటీఆర్ కు శిక్ష తప్పదని.. వారి పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. 


రెండేళ్ల కిందటి ఛాలెంజ్‌కు ఇప్పుడు స్పందించారా !
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను చెప్పుతో కొడతాం అనే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. హైదరాబాద్ డ్రగ్ కేసులు ముఖ్యంగా సినీ తారలు ఉన్న కేసు అటకెక్కిన తర్వాత, రాష్ట్రంలో తీవ్రమైన మాదక ద్రవ్యాల వాడకం పెరిగిందన్నారు. దాని వలన అనేక హత్యాచార్యలు కూడా ఈ డ్రగ్స్ కారణం అవుతుందన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు పదే పదే గుట్కా తీసుకుంటాడు అని బండి సంజయ్ పై బురద చాల్లే పని చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ రెండేళ్ల కిందట సవాల్ విసిరితే ఇప్పుడు ఛాలెంజ్ స్వీకరించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. చెప్పుతో కొడతాం అనేది అనాగరిక మాట. డ్రగ్స్ తీసుకున్నాక వెంట్రుకలు, గోర్లలో కేవలం 60- 90 రోజులలో మాత్రమే ఆ డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటాయి. తదుపరి కనిపించవు. 2 ఏండ్ల క్రింద విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు స్పందించడంలో అర్థమేంటో బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు.