KA Paul Fires on Telangana Police: తెలంగాణ పోలీసులపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ నెల 6న హన్మకొండ జిల్లాలో బహిరంగ సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో తలపెట్టిన సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుమతి ఇవ్వకుండా అదే రోజున కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బహిరంగ సభకి ఎలా అనుమతిస్తారని నిలదీశారు.


రైతుల కోసం ఉద్యమం చేస్తున్నందుకే, సీఎం కేసీఆర్ భయపడి అనుమతివ్వకుండా తనను అడ్డుకుంటున్నారని కేఏ పాల్ ఆరోపించారు. హైదరాబాద్, వరంగల్ పోలీస్ కమిషనర్‌లకు ఆదేశాలిచ్చి సభకు అనుమతివ్వకుండా చేశారని అన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పై కూడా కేఏ పాల్ నిప్పులు చెరిగారు. సీపీ తాను ఎవరో తెలీదని చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. తనకు ఎన్ని అడ్డకుంలు పెట్టినా నిరుద్యోగులు, రైతుల కోసం బహిరంగ సభ నిర్వహించి తీరతానని తేల్చి చెప్పారు. అనుమతి ఇవ్వని పక్షంలో కోర్టుకు కూడా వెళ్తానని కేఏ పాల్ హెచ్చరించారు.


‘‘హైదరాబాద్ సీపీకి నేను ఎవరో తెలీదట. నేను ఎవరో గూగుల్ లో వెతికి తెలుసుకోమని చెప్పి వచ్చా. మే 6వ తేదీన బహిరంగ సభకు మాకు పర్మిషన్ ఇవ్వాలి. లేదంటే రాహుల్ గాంధీ సభను క్యాన్సిల్ చేయాలి. ఏది ఏమైనా సరే.. నిరుద్యోగులు, రైతుల కోసం నేను బహిరంగ సభ పెట్టి తీరతాను.’’ అని కేఏ పాల్ చెప్పారు.


సింగరేణి కాలనీలో కేఏ పాల్ పర్యటన
కేటీఆర్ దత్తత తీసుకున్న సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో కేఏ పాల్ పర్యటించారు. సాక్షాత్తూ మంత్రి దత్తత తీసుకున్నా.. అక్కడ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, ప్రజలు దుర్భరం జీవితం గడుపుతున్నారని అన్నారు. ఇక రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించవచ్చని అన్నారు. 30 వేల మంది నివసిస్తున్న సింగరేణి కాలనీ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. సింగరేణి కాలనీలో వలస కూలీలు దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. ఈ ప్రదేశంలో గుడిసెలకు బదులుగా రెండు బెడ్ రూం ఇళ్లను కట్టించవచ్చు కదా అని కేఏ పాల్ నిలదీశారు.