Jailer Movie Villain Vinayakan arrested at Shamshabad Airport | హైదరాబాద్: రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిట్ మూవీ జైలర్ (Jailer Movie) నటుడు వినాయకన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలుమార్లు దురుసుగా ప్రవర్తించి, దాడులు చేసి అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు జైలర్ మూవీ విలన్. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో CISF వాళ్లపై నటుడు వినాయకన్ దాడికి పాల్పడ్డాడు. దాంతో జైలర్ విలన్ వినాయకన్ ను సీఐఎస్ఎఫ్ అరెస్ట్ చేసి, ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. వాళ్లు వినాయకన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మద్యం మత్తులో ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో గొడవపడి, దాడి చేసినట్లు తెలుస్తోంది. 


ఈ ‘విలన్’కు వివాదాలు కొత్తేమీ కాదు
‘జైలర్‌’లో విలన్‌గా నటించిన వినాయకన్‌ కు వివాదాలు కొత్త కాదు. గత ఏడాది అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ ను అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం మత్తులో గొడవకు దిగాడు. నటుడు వినాయకన్‌ తమను ఇబ్బంది పెడుతున్నాడని, అపార్ట్‌మెంట్‌ వాసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు అక్కడికి చేరుకుని నటుడు వినాయకన్ ను ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్ స్టేషన్‌ను తరలించారు. అప్పుడు కూడా మద్యం మత్తులో ఉన్న వినాయకన్‌ కోపంతో ఊగిపోయాడు. తాము మర్యాదగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు వినాయకన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం అది తొలిసారి కాదు. గతంలోనూ ఓ మోడల్‌ను వేధించిన ఆరోపణలతో అతడిని అరెస్ట్‌ అయ్యాడు.