హైదరాబాద్: ఖమ్మంలో వరదల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించి వరదలో చిక్కుకున్న కొందరి ప్రాణాలు కాపాడిన సుభాన్ ని ధైర్యసాహసాలను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మెచ్చుకున్నారు. ఖమ్మం ప్రకాష్ నగర్లో వరదల్లో చిక్కుకున్న 9 మందిని తన ప్రాణాలు లెక్కచేయకుండా వెళ్లి కాపాడిన సుభాన్ తెగింపును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు. జేసీబీ డ్రైవర్ సుభాన్ కు రూ. 51000 నగదు బహుమతి ఇచ్చి సత్కరించారు అసదుద్దీన్. తన ప్రాణాలు లెక్కచేయకుండా మరో 9 మంది ప్రాణాలు రక్షించిన సుబాన్ కు ఖమ్మంలో డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అసదుద్దీన్ సిఫారసు చేశారు.


తాను 9 మంది ప్రాణాలు కాపాడటంపై జేసీబీ డ్రైవర్ ఎస్‌కే సుబాన్‌ అనంతరం స్పందించారు. పోతే ఒక్కడిని.. వస్తే పది మందిమి అంటూ జేసీబీ డ్రైవర్‌ చెప్పిన మాటలు ఎంతో మందిని కదిలించాయి. సాటి మనిషి ప్రాణం కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్లవచ్చు అని నిరూపించాడు తను. ఆదివారం (సెప్టెంబర్ 1న) ఖమ్మంలో మున్నేరు వాగుకు ఒక్కసారిగా పొంగింది. భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరగడంతో ఖమ్మం ప్రకాశ్‌నగర్‌ బ్రిడ్జిపై శ్రీనివాసరావు అనే వ్యక్తి, ఆయన కుమారుడు విక్రమ్, మోహన్‌ & లక్ష్మి దంపతులు వీరి ఇద్దరు కుమారులు, వర్కర్లు వెంకన్న, వినోద్ లతో పాటు మరొకరు చిక్కుకున్నారు. దాదాపు 14 గంటలపాటు తమకు ఎవరైనా సహాయం చేస్తారా, అసలు ప్రాణాలతో గట్టెక్కుతామా అని భయం భయంగా గడిపారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతలోనే హరియాణావాసి సుబాన్ చాకచక్యంగా వ్యవహరించి జేసీబీని వరద ప్రవాహంలో ముందుకు పోనిచ్చి, 9 మందిని జేసీబీలో బయటకు తీసుకువచ్చి రక్షించారు.