Devotees Prayers at Chilkur Balaji Temple | మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరులో ఉన్న వెంకటేశ్వర స్వామి చాలా పవర్ ఫుల్ అని భక్తులు నమ్ముతారు. కోరిన కోర్కెలె తీర్చే స్వామిగా చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని, ఇక్కడి స్వామి వారిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ముప్పుతో కొన్ని జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు, తుపానుల నుంచి రక్షించాలని చిలుకూరు బాలాజీని భక్తులు ప్రార్థించారు. ఇందుకోసం చిలుకూరు బాలాజీ ఆలయ పూజారులతో కలిసి భక్తులు రెండు అదనపు ప్రదక్షిణలు చేశారు. వరద బాధితులకు సహాయార్థం అన్ని విధాలుగా  సహకరించిన వారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు వణికిపోయాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలతో జలాశయాలు నిండిపోగా, పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, ఇండ్లు నీట మునిగాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది. ఏపీలో ముఖ్యంగా విజయవాడ, గుంటూరులో వరద నష్టాన్ని మిగిల్చింది. బుడమేరుకు గండ్లు పడటంతో వరద నీరు విజయవాడలో పలు కాలనీలను ముంచెత్తగా ప్రాణనష్టం సంభవించింది. ఏపీ, తెలంగాణలో వరదలతో 50 నుంచి 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితులలో చిల్కూరు బాలాజీ మళ్లీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజల్ని మరింత విధ్వంసం జరగకుండా రక్షించాలని భక్తులు ప్రార్థించారు. 


వినాయక చవితి సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలు, తుఫాన్, రాబోయే ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడాలని చిలుకూరు బాలాజీని మొక్కుకున్నారు. భారీ వర్షాలు పడకుండా జల ప్రళయం కలగకుండా ఉండాలని ప్రార్థిస్తూ అర్చకులు సుదర్శన అష్టకం పటించారు. గోవింద నామస్మరణతో ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు.


సంక్షోభ సమయంలో గోవింద నామస్మరణతో కూడిన ప్రదక్షిణం నిర్వహించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనుషులతో పాటు అన్ని రకాల జీవులు, జంతువులను వర్షాలు, వరదలు, విపత్తుల నుంచి కాపాడాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారులు వరదల సమయంలో చేపట్టిన సహాయక చర్యలను చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సిఎస్ రంగరాజన్ ప్రశంసించారు. వరద బాధితుల సహాయార్థం తమకు తోచినంత సీఎం రిలీఫ్ ఫండ్‌కు సహాయం చేసి ఇతరులను ఆదుకోవాలని భక్తులకు రంగరాజన్ పిలుపునిచ్చారు. అందరిపై చిలుకూరు బాలాజీ స్వామివారి కృప ఉంటుందన్నారు.


Also Read: కమల్ హాసన్ సినిమాలో ఖైరతాబాద్ వినాయకుడు- ఒక్క అడుగుతో మొదలై గణేష్‌ గురించి తెలుసా?