Vinayaka Chavithi 2024: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన సప్తముఖ మహాశక్తి గణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ చేశారు. 70 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్న కమిటీని అభినందించారు. ఈసారి కూడా అదేస్థాయిలో 70 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్న కమిటీ ప్రయత్నం అభినందనీయమన్నారు. వినాయకుడి దయవల్లే భారీ వరదల నుంచి త్వరగా బయటపడ్డామన్నారు రేవంత్ రెడ్డి


దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. 70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలు తెలుసుకుందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోనే 1లక్షా 40వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారని వివరించారు. వారి సమస్యలు గుర్తించే గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిందన్నారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని... అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామని అభిప్రాయపడ్డారు. 




పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఖైరతాబాద్‌లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానన్నారు. ప్రతీ ఏటా ఉత్సవ కమిటీ ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానన్నారు. 
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కూడా కుటుంబసభ్యులతో కలిసి తన ప్రత్యేక పూజలు నిర్వహించారు.