Khairatabad Ganesh Idol: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని గణేష్ మండపాలు ఉన్నా.. ఎవరు ఎక్కడ పూజలు చేసినా అందరూ మాట్లాడుకునేది మాత్రం ఖైరదారాబాద్ వినాయకుడి గురించే. ఏటా ఏదో ప్రత్యేక రూపంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేకాకుండా దేశమంతా తమవైపు చూసుకునేలా చేస్తారు ఇక్కడ కమిటీ సభ్యులు. గణేష్ పూజ చర్చ వచ్చిందంటే చాలు ఖైరతాబాద్ గణపతి గురించి ప్రస్తావన రానిదే ఆ డిస్కషన్ పూర్తి కాదు. అలాంటి ఖైరతాబాద్ లంబోదరుడు ఈసారి కూడా ప్రత్యేకత చాటుకున్నాడు.
Also Read: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
ఖైరతాబాద్ గణపతి ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పూజలు అందుకోనున్నాడు. ఈసారి విగ్రహం ఎత్తు 70 అడుగులుగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవాలు ప్రారంభమై నేటికి 70 ఏళ్లు అవుతున్న వేళ ఈసారి 70 అడుగులు విగ్రహాన్ని రూపొందించారు. 70 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో చూడముచ్చటైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని తీర్తిదిద్దారు.
ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తులో రూపొందించిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముఖాలు కలిగి ఉన్నాడు. ఆదిశేషావతారం కూడా మనకు ఈ విగ్రహంలో కనిపిస్తుంది.
Also Read: పూజకు మట్టి వినాయకుడే ఎందుకు..పురాణాల్లో దీనిగురించి ఏముంది!
శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహానికి ఉన్న 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద- ఎడమవైపు రుద్రాక్ష, ఆననంపుస్తకం, వీణ, కమలం, గద కలిగి ఉన్నాయి. మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలు తీర్చిదిద్దారు. మహాగణపతి పాదాల వద్ద 3 అడుగుల ఎత్తులో మూషికం ఉంటుంది. ఈ విగ్రహం వద్దే 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం విగ్రహమూర్తులను కూడా ఉంచారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఈ మహాద్భుత విగ్రహాన్ని తీర్చి దిద్దారు.
2023 విగ్రహం ఎలా ఉందంటే?
గత ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. 63 అడుగులు ఎత్తు, 28 అడుగులు వెడల్పుతో దీన్ని రూపొందించారు. నిల్చున్న తీరులో 'శ్రీ దశమహా విద్యాగణపతి' విగ్రహంపై తలపై 7 సర్పాలు, పది చేతులు ఉన్నాయి. కుడివైపు చేతుల్లో ఆశీర్వాదం, దండ, ధాన్యం, తల్వార్, బాణం ఉంచారు. ఎడమవైపు చేతిల్లో లడ్డు, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంచారు. కాళ్ల వద్ద పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ప్రతిష్టించారు. ప్రధాన మండపం రెండు వైపులా శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు పెట్టారు.
మట్టితో తొలిసారిగా..
అంతకు ముందు ఏడాది అంటే 2022లో 50 అడుగుల ఎత్తుతో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఎడమవైపున శ్రీ తిశక్తి మహా గాయత్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది తొలిసారిగా మట్టితో విగ్రహాన్ని రూపొందించారు. అప్పటి నుంచి మట్టితో చేయడం మొదలు పెట్టారు.