Income Tax Raids In Hyderabad: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ కలకంల రేపుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎల్‌ఆర్‌ నివాసం ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయనతోపాటు బడంగపేట్‌ మేయర్‌ పారిజాత ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె తిరుపతి పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్‌లో ఉంది. ఓవైపు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూనే ప్రత్యర్థులను ఎలా ఓడించాలనే వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రచారంలో కీలక నేతలు ప్రజల వద్దకు వెళ్లి తాము చేసిన మంచి పనులు ప్రత్యర్థులు లోపాలను ఎత్తి చూపుతూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ రైడ్స్‌ కలకలం రేపుతున్నాయి. 


మహేశ్వరం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కిచెన్నగారి లక్ష్మారెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు సాగుతున్నాయి. ఆయనతోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లపై కూడా రైడ్స్ చేశారు అధికారులు. హైదరాబాద్‌ సహా పది ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. లక్ష్మారెడ్డి ఫామ్‌హౌస్‌లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. 


తనిఖీలు చేపట్టిన ప్రాంతాల్లో అధికారులు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని బయట వ్యక్తులను ఆ  పరిసరాలకు రానివ్వడం లేదు. లోపల ఉన్న వారిని కూడా బయటకు పోనివ్వడం లేదు. ఆయనతో పాటు మహేశ్వరం టికెట్ ఆశించిన బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల నుంచి మెరుపు దాడులు చేశారు అధికారులు. ప్రస్తుతం పారిజాత నర్సింహారెడ్డి తిరుపతిలో ఉన్నారు. ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. వీళ్లతో పాటు బాలాపూర్‌ లడ్డు వేలం దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. 


'రైడ్స్ కుట్రలో భాగమే'


ఐటీ రైడ్స్ రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఉన్న ఆమె, ఐటీ సోదాలపై స్పందించారు.  రూ.వేల కోట్లు సంపాదించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరగలేదని, మేయర్ అయిన తన ఇంటిపై దాడులు చేయిస్తారా.? అంటూ నిలదీశారు. తాము ఇంటిలో లేకపోయినా వెంటనే రావాలని ఐటీ అధికారులు చెప్పడంపై పారిజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. సబితా ఇంద్రరెడ్డి ఓడిపోతుందని సర్వేలు చెప్పాయని, ఆమెకు ఓటమి భయం పట్టుకుందని మండిపడ్డారు. అధికార పార్టీల నేతలపై కాకుండా తమపై ఐడీ దాడులు చేయడం, ఇబ్బంది పెట్టాలనే కుట్రేనని, బీఆర్ఎస్ కక్ష పూరిత రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు.