Pravalika Suicide Case: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు శివరాం రాథోడ్ బెయిల్ రద్దు చేయాలని చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో అప్పీల్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడు శివరాంకు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు  చిక్కడ్‌పల్లి పోలీసులు మహారాష్ట్రలోని థాణేకు వెళ్లి నోటీసులు అందించారు.


అక్టోబర్ 21న బెయిల్
గత నెల 21వ తేదీ శనివారం నిందితుడు శివరాం రాథోడ్‌ను పోలీసులు  నాంపల్లి కోర్టు లో ప్రవేశపెట్టారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ప్రవళిక ఆత్మహత్య కేసులో సరైన సాక్షాధాలు లేనందున నిందితుడు శివరాంకు బెయిల్ ఇచ్చింది. రూ. 5000 వ్యక్తి గత పూచికత్తుతో శివరాంను విడిచి పెట్టాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. 


తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు శివరాంను అక్టోబర్ 20 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన శివరాం సరెండర్ పిటిషన్ వేశాడు. ప్రవళిక ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని, కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా రిమాండ్ విధించలేమంటూ శివరాం వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అనంతరం పోలీసులు నాంపల్లి కోర్టు ప్రాంగణంలోనే శివరాంను అరెస్ట్ చేయడం తెలిసిందే. 


అసలేం జరిగిందంటే ?
వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవలిక (23) హైదరాబాద్ అశోక్ నగర్ హాస్టల్‌లో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 13న ఆమె తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, గ్రూప్ - 2 పరీక్ష వాయిదా పడడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ వందలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, సర్కారుపై విమర్శలు చేశారు. 


పోలీసులు ఏం చెప్పారంటే.?
రంగంలోకి దిగిన  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రకటించారు. ఫోన్, వాట్సాప్, స్నేహితులను విచారించిన అనంతరం ప్రవళిక ప్రియుడు ఆమెను కాదని మరో యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ యాదగిరి తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 


రాజకీయంగానూ దుమారం
ఓ వైపు నిరుద్యోగుల ఆందోళన, మరో వైపు పోలీసుల ప్రకటనతో రాజకీయంగానూ ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగింది. పోలీసులు దీనిపై స్పష్టమైన ప్రకటనే చేశారని చెప్పిన మంత్రి కేటీఆర్, అది నిజం కాదని విపక్షాలు నిరూపించగలరా.? అంటూ ప్రశ్నించారు. అసలు ప్రవళిక గ్రూప్స్ పరీక్షలకే దరఖాస్తు చేయలేదని కేటీఆర్ చెప్పగా, ఆమె పరీక్ష రాసిందంటూ సంబంధిత పత్రాలను కొందరు నిరుద్యోగులు నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.